బండి వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లేమికి నిదర్శనం
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:57 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్టు ఇచ్చామంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తేవాలి: మంత్రి పొన్నం
మేమూ త్వరలో బీజేపీకి గిఫ్ట్ ఇస్తాం: దుద్దిళ్ల
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్టు ఇచ్చామంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ వ్యాఖ్యలు బండిసంజయ్ రాజకీయ అవగాహనా లేమికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించగా, తామూ బీజేపీకి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఏకమై కాంగ్రె్‌సను ఓడించాయని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మైత్రిని మరింత బహిర్గతం చేశాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోనే ఉన్నాయని, అయినా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చి చూపాలని, రామగుండం నుంచి హైదరాబాద్ వరకు 8 వరుసల రహదారి నిర్మాణం చేపట్టి చూపాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓటమిపాలయాయ్యమని, ఇది భవిష్యత్తు ఎన్నికలపై ఎలాంటి ప్రభావమూ చూపదని స్పష్టం చేశారు. ఓటమిపై సమీక్షించుకుంటామని పొన్నం చెప్పారు. బీజేపీకి ఇప్పటికే తాము ఎన్నో గిఫ్టులు ఇచ్చామని, త్వరలో ఆ పార్టీకి మరో గిఫ్టు కూడా ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నామని శ్రీధర్‌బాబు చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఏకమై కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టనప్పుడే వారు ఏం చేయబోతున్నారో స్పష్టమైందని ఆయన అన్నారు.