Share News

Congress: కాంగ్రెస్‌లో పదవుల పండగ!

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:38 AM

కాంగ్రెస్‌లో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున పేర్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Congress: కాంగ్రెస్‌లో పదవుల పండగ!

  • వారంలోపే నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి చాన్స్‌

  • గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు కూడా

  • మీనాక్షి, మహేశ్‌గౌడ్‌కు నివేదికలు

  • నియోజకవర్గానికి రెండు చొప్పున పేర్లు

  • నేడు సీఎంతో మీనాక్షి, మహేశ్‌ భేటీ

హైదరాబాద్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున పేర్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలపైన బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ భేటీ అయి చర్చించనున్నారు. ఇందులోనే పదవుల భర్తీకి సంబంధించి మరింత స్పష్టత రానుంది. నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంత త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే.. అంత త్వరగా ఆమోదించి పంపుతానంటూ ఇటీవల టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీల్లో సీఎం రేవంత్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జాబితా రూపకల్పనలో ఇన్‌చార్జి మంత్రులు అలసత్వం వహిస్తున్నారంటూ ఓ సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు. తాజాగా సీఎం వద్దకు జాబితా చేరనున్న నేపథ్యంలో ఆమోదం లాంఛనమేనని, వారంలోపే పోస్టుల భర్తీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


అలాగే, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను కూడా వారం లోపే ప్రకటించనున్నట్లు పేర్కొంటున్నాయి. పార్టీ కమిటీల కూర్పుతోపాటు నామినేటెడ్‌ పదవుల భర్తీకి పేర్లు ప్రతిపాదించేందుకు టీపీసీసీ నియమించిన పరిశీలకులతో మంగళవారం మీనాక్షీ నటరాజన్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన సమావేశాల్లో ప్రతిపాదించిన పేర్లు, ఇతర అంశాలకు సంబంధించి మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ లేవనెత్తిన సందేహాలను పరిశీలకులు నివృత్తి చేశారు. నామినేటెడ్‌ పోస్టులకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరి పేర్లను ప్రతిపాదించగా, పార్టీ కమిటీల కూర్పు, పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చామని, సామాజిక న్యాయానికీ పెద్ద పీట వేశామని వివరించారు. కాగా, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ తెలిపారు. పరిశీలకులు, నేతలతో సమావేశాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి, ప్రజలకు సుదీర్ఘంగా సేవలందించిన ముఖేశ్‌గౌడ్‌, శివశంకర్‌ల విగ్రహాలను హైదరాబాద్‌లో పెట్టాలని కార్యకర్తలు అడుగుతున్నారని, ఈ విషయమై సీఎంతో మాట్లాడతానని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:38 AM