Share News

Accident: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:46 AM

హైదరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ సభకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ కార్యకర్త మృతి చెందాడు.

Accident: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి

  • కాంగ్రెస్‌ సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

  • ఉత్తమ్‌ నివాళి.. రూ.10 లక్షల పరిహారం ప్రకటన

కట్టంగూరు/మఠంపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ సభకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ కార్యకర్త మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం తండాకు చెందిన 8 మంది హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ సభకు వెళ్లారు. సమావేశం పూర్తయిన తర్వాత కారులో తిరుగుపయనమయ్యారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పామనగుండ్ల వద్ద వెనుక మరో కారులో వస్తున్న కార్యకర్తల కోసం వీరు ప్రయాణిస్తున్న కారును రోడ్డు పక్కన ఆపారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది.


దీంతో కారు రోడ్డు పక్కన ఉన్న కాల్వలోకి పల్టీ కొట్టింది. కారులో ఉన్న కుర్రి శ్రీను(38)కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి స్వల్పగాయాలు, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, నల్లగొండ జిల్లా నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీను మృతదేహానికి మంత్రి ఉత్తమ్‌ నివాళులర్పించారు. శ్రీను కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారు. రూ.5లక్షలు వెంటనే ఇచ్చారు. శ్రీను భార్యకు ఉద్యోగం, ఆయన పిల్లల చదువుకు సహకారం అందిస్తామని చెప్పారు. కుర్రి శ్రీను మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Jul 06 , 2025 | 04:46 AM