Manish Tewari: మధ్యభారత రాష్ట్రాలకే లాభం
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:21 AM
ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఒక వ్యక్తి-ఒక ఓటు-ఒకే విలువ’ సూత్రం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలే కాక, ఉత్తరాది రాష్ట్రాలు కూడా నష్టపోతాయని.. జనాభా నియంత్రణలో వెనకబడిన మధ్యభారత రాష్ట్రాలే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందుతాయని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజనతో వాటికి మాత్రమే ప్రయోజనం
దక్షిణాదికే కాదు.. ఉత్తరాది రాష్ట్రాలకూ నష్టమే
డీలిమిటేషన్‌కు కొత్త సూత్రం
లేదా శాశ్వతంగా నిలిపివేయాలి
కాంగ్రెస్ ఎంపీ మనీశ్‌తివారీ
న్యూఢిల్లీ, మార్చి 6: ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఒక వ్యక్తి-ఒక ఓటు-ఒకే విలువ’ సూత్రం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలే కాక, ఉత్తరాది రాష్ట్రాలు కూడా నష్టపోతాయని.. జనాభా నియంత్రణలో వెనకబడిన మధ్యభారత రాష్ట్రాలే దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందుతాయని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభతోపాటు రాజ్యసభలో సైతం దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల సీట్ల శాతం తగ్గుతుందని.. కాబట్టి, నియోజకవర్గాల పునర్విభజనకు కొత్త సూత్రాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో.. దక్షిణాదికే కాక ఉత్తరాదికీ నష్టం జరుగుతుందంటూ మనీశ్ తివారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ఉదాహరణకు.. ప్రస్తుతం పంజాబ్‌కు 13 సీట్లు, హరియాణాకు 10 సీట్లు ఉన్నాయి.
జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే పంజాబ్, హరియాణాకు కలిపి 18 సీట్లే మిగులుతాయి. లోక్‌సభలో పెరిగే మొత్తం సీట్లతో పోల్చితే.. సభలో వారి వాటా మరింతగా తగ్గిపోతుంది. ఏ రకంగా చూసినా ఆ రాష్ట్రాల ప్రాముఖ్యం తగ్గిపోతుంది’’ అని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘సీట్ల సంఖ్య విషయంలో హరియాణాతో సమానంగా ఉండడాన్ని పంజాబ్ అంగీకరిస్తుందా? తమ సీట్ల సంఖ్య యథాతథంగా ఉండడాన్ని హిమాచల్ ప్రదేశ్ ఒప్పుకొంటుందా? జమ్ముకశ్మీర్ తన సీట్ల సంఖ్య స్వల్పంగా ఆరు నుంచి తొమ్మిదికి పెరగడాన్ని ఆమోదిస్తుందా?’’ అని మనీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఈ మొత్తం ప్రక్రియలో లబ్ధి పొందేది మధ్యభారత రాష్ట్రాలే. జనాభా నియంత్రణలో వెనకబడినందున.. వాటి పార్లమెంటు సీట్ల సంఖ్యలో పెరుగుదల ఉంటుంది. కాబట్టి, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు ఒక కొత్త సూత్రాన్ని రూపొందించాలి. లేదా ఈ ప్రక్రియను శాశ్వతంగా నిలిపివేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.