Share News

Danam Nagender: రాజీనామా బాటలో దానం

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:30 AM

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్‌ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్‌పై విచారణ దాకా.....

Danam Nagender: రాజీనామా బాటలో దానం

  • కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతి కోసమే ఢిల్లీకి!

  • పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా

  • ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే!

  • అందుకే రాజీనామా యోచనలో నాగేందర్‌

  • మళ్లీ ఖైరతాబాద్‌ టికెట్‌ ఇవ్వాలని వినతి!

  • గెలిచొస్తా.. మంత్రి పదవివ్వాలని ప్రతిపాదన?

  • అధిష్ఠానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా..

  • కడియం శ్రీహరి విషయంలో తర్జనభర్జనలు

  • ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన?

  • స్పీకర్‌ను కలిసి మరింత గడువు కోరిన కడియం

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్‌ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్‌పై విచారణ దాకా వెళ్లకూడదని అనుకుంటున్నారా? అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకొని, ఖైరతాబాద్‌ టికెట్‌పై హామీ తీసుకునేందుకే ఢిల్లీ వెళ్లారా? కాంగ్రెస్‌ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా..? అంటే కాంగ్రెస్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

గురువారం నాటికి దానం నాగేందర్‌, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణను పూర్తి చేశారు. అనర్హత పిటిషన్లపై ఈ నెల 23కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలకు స్పీకర్‌ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్‌ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా, రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఉన్న ఆయన.. అధిష్ఠానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.


అక్కడి దాకా వెళ్తే వేటే..!

విచారణ పూర్తయిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలకూ స్పీకర్‌ నోటీసులు ఇచ్చినా.. వివరణ ఇచ్చేందుకు వారు గడువు అడిగి తీసుకున్నారు. నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో పిటిషన్లపై ఈ నెల 23కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం, కడియంకు స్పీకర్‌ మళ్లీ నోటీసులు జారీ చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన దానం.. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది.

తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకూ వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలతో ఢిల్లీ వెళ్లారని అంటున్నాయి. ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పించడం లేదా క్యాబినెట్‌ హోదాలో నామినేటెడ్‌ పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలో కాంగ్రె్‌సలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దానం.. తనకున్న పాత పరిచయాలతో అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే దానం తన పదవికి రాజీనామా చేస్తారని పేర్కొంటున్నారు. వెంటనే అనుమతి వస్తే.. ఒకటి, రెండు రోజుల్లోనే రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అధిష్ఠానం సమయం తీసుకుంటే.. దానం స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు.


కడియం పరిస్థితి ఏంటి..?

కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్‌ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన కడియం శ్రీహరి.. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన తన కూతరు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. కావ్య నామినేషన్‌ పత్రాల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకం కూడా చేసినట్లు సమాచారం. కడియంపై అనర్హత పిటిషన్‌లో ఇది బలమైన ఆధారంగా మారనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ నోటీసులకు వివరణ ఇచ్చి, విచారణలో పాల్గొనడమా? లేక ఆయనతోకూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కొనడమా? అన్నదానిపై కాంగ్రెస్‌ వర్గాలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. కడియం కూడా రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతోంది.

స్పీకర్‌ను సమయం కోరిన కడియం

అనర్హత పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. స్పీకర్‌ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసిన కడియం శ్రీహరి.. అఫిడవిట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉందని, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. తన వినతి పట్ల స్పీకర్‌ సానుకూలంగా స్పందించినట్లు కడియం తెలిపారు.

2.jpg


ఇవీ చదవండి:

బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

హీరో, టీవీకే చీఫ్ విజయ్‏కి పోలీసుల షాక్... ఆయన ప్రచారానికి..

Updated Date - Nov 22 , 2025 | 06:50 AM