Meenakshi Natarajan: ఏకపక్ష పాలన సాగించడానికి ఇది రాచరికం కాదు
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:56 AM
ప్రజాస్వామ్యంలో అణచివేతకు తావులేదు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి... ఎవరైనా సరే, ప్రజాభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు. ఏకపక్షంగా పాలన సాగించడానికి ఇదేమీ రాచరికం కాదు’’ అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు.

అధికారాన్ని ప్రజలపై బుల్డోజర్ నడపడానికి కాక.. వారి సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి
ప్రజా ఉద్యమాల ఐక్యవేదిక సదస్సులో మీనాక్షి నటరాజన్
చరఖాతో నూలు వడికిన మీనాక్షి
పార్టీ కండువా కప్పబోయిన కార్యకర్తకు మందలింపు
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును సమీక్షించాలి: మేధాపాట్కర్
హైదరాబాద్ సిటీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాస్వామ్యంలో అణచివేతకు తావులేదు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి... ఎవరైనా సరే, ప్రజాభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు. ఏకపక్షంగా పాలన సాగించడానికి ఇదేమీ రాచరికం కాదు’’ అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. అధికారాన్ని ప్రజలపై బుల్డోజర్ నడపడానికి కాక.. వారి సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని సూచించారు. మూసీ నిర్వాసితులతో సంభాషించడానికి వెళ్లిన మేధాపాట్కర్‌ను సోమవారం స్థానిక పోలీసులు అడ్డగించడాన్ని ఆమె నిరసించారు. ఈ చర్య ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్యమాల పాత్ర’ అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. అయితే.. తానొక రాజకీయ పార్టీ ప్రతినిధిగా కాక సర్వోదయ ఉద్యమ కార్యకర్తగా ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. రాజకీయ పార్టీలు గతి తప్పినప్పుడు వాటిని సరైన దిశగా తీసుకెళ్లగలిగేవి ప్రజా ఉద్యమాలు మాత్రమేనని, ఆందోళనకారులను ప్రభుత్వాలు శత్రువుల్లా భావించకూడదని గట్టిగా చెప్పారు. ‘‘మధ్యప్రదేశ్ సీఎంగా దిగ్విజయ్ సింగ్ ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట రోజంతా నిరసనలు కొనసాగేవి.
సాయంత్రమైతే ఉద్యమకారులు, పాలనాధికారులు కలిసి చోళే బఠానీ తింటూ కబుర్లాడుకునేవారు’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. కొన్నేళ్లుగా మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా, ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సు కన్నా, కార్పొరేట్ల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ఆ క్రమంలో పౌరులకు, పర్యావరణానికి శ్రేయస్కరం కాని విధానాలు రూపొందిస్తుండడం బాధాకరమన్నారు. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ సమస్యలన్నీ ఒక్కటే కనుక, వారి హక్కులసాధనకు జాతీయ స్థాయి సంఘాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి తెలంగాణకు చెందిన షేక్ సలావుద్దీన్ వంటి కార్యకర్తలు ముందుకు రావాలని సూచించారు. జాతీయ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు వంటి విషయాలపై సేవాగ్రామ్‌లో కాంగ్రెస్ నేతలకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి సైతం అందాలన్న గాంధీజీ ‘అంత్యోదయ’ సూత్రాన్ని పాలకులు ఆకళింపు చేసుకోవాలని సూచించారు. కాగా.. ఈ సదస్సుకు ఆమె నిర్ణీత సమయానికి పదినిమిషాల ముందే వచ్చారు.
వెంట ఎలాంటి మందీమార్బలం లేకుండా సాదాసీదాగా సభా స్థలానికి విచ్చేశారు. 45 నిమిషాలకుపైగా నేలమీద కూర్చొని.. తన వెంట తెచ్చుకున్న చరఖాతో నూలు వడికారు. ఆమె ప్రాంగణం నుంచి వెళుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు పార్టీ కండువా కప్పడానికి ప్రయత్నించగా.. ‘అందుకు ఇది వేదిక కాదు’ అని మందలించారు. మహిళల ఆత్మగౌరవానికి, తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధమైన ప్రపంచ సుందరి పోటీలను సీఎం రేవంత్‌కు చెప్పి ఆపించాలని పీవోడబ్ల్యూ సంధ్య విన్నవించగా మీనాక్షి సానుకూలంగా స్పందించారు. కాగా.. అమరావతి ప్రాజెక్టును ప్రపంచబ్యాంకు సమీక్షిస్తున్నట్టే, మూసీ ప్రాజెక్టును సమీక్షించాల్సిన అవసరం ఉందని ఈ సదస్సులో పాల్గొన్న సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.