Share News

PHC: పీహెచ్‌సీలకు చుట్టాలుగా వైద్యులు!

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:54 AM

ఆ కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ సంతోష్‌ విధులకు హాజరుకాలేదు సరికదా లీవు కూడా పెట్టలేదు. దాంతో కలెక్టర్‌ అతడిని సస్పెండ్‌ చేశారు. కొన్ని రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

PHC: పీహెచ్‌సీలకు చుట్టాలుగా వైద్యులు!

నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు విధులు .. పలు జిల్లాల్లో తరచూ డాక్టర్ల డుమ్మా

2-3 గంటలకు మించి ఉండని పరిస్థితి

డాక్టర్లు లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు

సీసీ కెమెరాలున్నా పర్యవేక్షణ కరవు

డీహెచ్‌ ఆఫీసులో మూలనపడ్డ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్ల్లా ఇందల్‌వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) జిల్లా కలెక్టర్‌ ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ సంతోష్‌ విధులకు హాజరుకాలేదు సరికదా లీవు కూడా పెట్టలేదు. దాంతో కలెక్టర్‌ అతడిని సస్పెండ్‌ చేశారు. కొన్ని రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది లేకపోవడంతో ముగ్గుర్ని సస్పెండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ పీహెచ్‌సీల్లో పరిస్థితి ఇలాగే ఉంది. వైద్యులు, వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావటం లేదు. వచ్చినా.. ఇలా వచ్చి, అలా వెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే వారానికి ఒకటి రెండుసార్లు కూడా డాక్టర్లు పీహెచ్‌సీలకు రావడం లేదు. వాస్తవానికి ప్రతీ పీహెచ్‌సీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఉండాలి. కానీ, చాలా పీహెచ్‌సీల్లో రెండు మూడు గంటలకు మించి వైద్యులు ఉండటం లేదన్న విమర్శలున్నాయి. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉదయం వేళనే ఆస్పత్రులకు వస్తారు. కానీ, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు లేకపోవడంతో వారు ఊళ్లల్లోని ఆర్‌ఎంపీ వైద్యులనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి డాక్టర్లతో రోగులు గొడవ పెట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఓ పీహెచ్‌సీకి వచ్చే ఓ మహిళా డాక్టర్‌తో రోగులు వాదనకు దిగారు. ఎప్పుడొచ్చినా మీరు ఎందుకు ఉండటం లేదని నిలదీశారు.


పని చేయని సీసీ కెమెరాలు

రాష్ట్రంలో 868 పీహెచ్‌సీలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అన్ని పీహెచ్‌సీల్లో వైద్యుడు, ఫార్మసీ, ల్యాబ్‌ వద్ద మూడేసి చొప్పున సీసీ కెమెరాలు పెట్టి వాటిని హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల (డీహెచ్‌) కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానించారు. రాష్ట్రంలోని ఏ పీహెచ్‌సీని అయినా అక్కడి నుంచి పర్యవేక్షించవచ్చు. కొన్ని రోజులు కొనసాగిన ఈ పర్యవేక్షణ ఇప్పుడు మూలనపడింది. దాంతో వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నారని తెలుస్తోంది. చాలాచోట్ల సీసీ కెమెరాలను పని చేయకుండా చేశారన్న విమర్శలున్నాయి.


వైద్యులతో డీఎంహెచ్‌వోల కుమ్మక్కు!

డుమ్మా కొడుతున్న వైద్యాధికారులతో జిల్లా వైద్యాధికారులు కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. విధులకు హాజరుకాని వైద్యులు డీఎంహెచ్‌వోలకు డబ్బులిచ్చి మేనేజ్‌ చేస్తున్నారని స్వయంగా ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారులే చెబుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలో అత్యధిక పీహెచ్‌సీల్లోని డాక్టర్లు వారానికి రెండు మూడు రోజులే విధులకు హాజరు అవుతున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మల్కాజ్‌గిరి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ నిత్యం మధ్యాహ్నం తర్వాతే ఆస్పత్రికి వస్తారని ఫిర్యాదులుందాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో పోస్టింగ్‌ తీసుకున్న వైద్యుల్లో చాలా మంది మైదాన ప్రాంతాల్లో డిప్యూటేషన్ల మీద పనిజేస్తున్నారు. ఇక, హైదరాబాద్‌, దాని చుట్టు పక్కల సుమారు 100 కిమీ.ల దూరంలో ఉన్న జిల్లాలకు చెందిన డీఎంహెచ్‌వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రొగామ్‌ ఆఫీసర్లలో అత్యధికులు స్థానికంగా ఉండటం లేదు. హైదరాబాద్‌లో ఉంటూనే అప్పుడప్పుడూ విధులకు వెళ్లివస్తారని విమర్శలున్నాయి.


పరిష్కారం ఇలా!

డుమ్మా డాక్టర్లకు చెక్‌ పెట్టాలంటే జీపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటలకే సంబంధిత పీహెచ్‌సీ నుంచి డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా కలసి జీపీఎస్‌ ఫోటో తీసి డిప్యూటీ డీఎంహెచ్‌వోకు పంపాలి. మళ్లీ సాయంత్రం 4 గంటలకు మరో జీపీఎస్‌ ఫోటో పంపాలి. వాటిని డిప్యూటీ డీఎంహెచ్‌వో ధ్రువీకరించి డీఎంహెచ్‌వోకు పంపించాలి. ఆ జీపీఎస్‌ అటెండెన్స్‌ వివరాలను డీఎంహెచ్‌వో రాష్ట్రస్థాయిలో డీహెచ్‌కు పంపాలి. ఈ హాజరు ఆధారంగానే వైద్యులు, వైద్య సిబ్బందికి వేతనాలిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే వ్యవస్థ బాగుపడుతుందని వైద్యనిపుణులు సర్కారుకు సూచిస్తున్నారు. విధులకు డుమ్మా కొట్టటం అనైతికమని, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించటమనే పవిత్రమైన వృత్తిలో ఉన్న తాము ఇటువంటి తప్పుడు పనికి పాల్పడకూడదన్న విలువలను కూడా వైద్యులలో పెంపొందింపజేయాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 17 , 2025 | 02:54 AM