Share News

టన్ను బొగ్గుపై చందా రూ.25కు పెంపు

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:02 AM

బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సామాజిక భద్రత కోసం టన్ను బొగ్గుపై స్వచ్ఛంద సహాయం రూపంలో వసూలు చేస్తున్న రూ.10 చందాను రూ.25కు పెంచాలని కోల్‌ మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(సీఎంపీఎ్‌ఫవో) నిర్ణయించింది.

టన్ను బొగ్గుపై చందా రూ.25కు పెంపు

  • స్వచ్ఛంద సహాయాన్ని పెంచాలని నిర్ణయం

  • సీఎంపీఎఫ్‌ నిధిని వృద్ధి చేసేందుకు యోచన

  • హైదరాబాద్‌లో తొలిసారిగా సీఎంపీఎ్‌ఫవో ట్రస్టీల భేటీ

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సామాజిక భద్రత కోసం టన్ను బొగ్గుపై స్వచ్ఛంద సహాయం రూపంలో వసూలు చేస్తున్న రూ.10 చందాను రూ.25కు పెంచాలని కోల్‌ మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(సీఎంపీఎ్‌ఫవో) నిర్ణయించింది. సీఎంపీఎ్‌ఫవో 183వ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్‌ దేవ్‌ దత్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పింఛన్‌ నిధిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం కేవలం థర్మల్‌ కేంద్రాలకు వినియోగించే బొగ్గు నుంచే చందాను వసూలు చేస్తున్నారు. ఇకపై వంటకు వాడే బొగ్గుపై కూడా టన్నుకు రూ.25 చందాను వసూలు చేయాలని నిర్ణయించారు.


సగటున 100 టన్నుల బొగ్గు వెలికి తీస్తే.. అందులో కుకింగ్‌ కోల్‌ వాటా 15-20 టన్నులుగా ఉంటుందని గుర్తించారు. దాంతో కుకింగ్‌ కోల్‌పై చందా వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. పింఛన్‌ నిధి ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, దీన్ని పెంచుకోకపోతే బొగ్గు గని కార్మికులకు రానున్న రోజుల్లో పింఛన్‌ కూడా ఇవ్వలేని పరిస్థితి రావచ్చొనే అభిప్రాయానికి వచ్చారు. పింఛన్‌దారుల సంక్షేమం దృష్ట్యా పింఛన్‌ నిధి సుస్థిరతకు కృషి చేయాలనే నిర్ణయంలో భాగంగా నిధి పెంపునకు ట్రస్టీలు అంగీకారం తెలిపారు. పింఛన్‌ నిధి పెరిగితేనే కార్మికుల సంక్షేమానికి మరింత వీలు కలుగుతుందని గుర్తించారు. తొలిసారిగా హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర బొగ్గు శాఖ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సీఎంపీఎఫ్‌ అధికారులు, బొగ్గు కంపెనీల ప్రతినిధులు, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 05:02 AM