Chief Minister Revanth Reddy: ఫాంహౌజ్‌లో దాక్కున్నా..లాక్కొచ్చి లోపలేస్తాం
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:38 AM
గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్‌ను గేట్ వే ఆఫ్ డ్రగ్స్‌గా మార్చారని.. ఆ సంస్కృతిని రూపుమాపి, డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఈగల్ ఫోర్స్‌ను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు....
గత ప్రభుత్వంలో హైదరాబాద్‌ను ‘గేట్ వే ఆఫ్ డ్రగ్స్’గా మార్చారు
ఆ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకే మేం ఈగల్ ఫోర్స్ తీసుకువచ్చాం
ఎవరి మిత్రులైనా, బంధువులైనా వదలం
రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహితం చేస్తాం
అక్కసుతో ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు
విద్యనే మనందరి విజయానికి వజ్రాయుధం
ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు
డిసెంబరు 9న తెలంగాణ రైజింగ్-2047 ప్రణాళిక ప్రకటిస్తాం
మేధావులు సూచనలు, సలహాలు ఇవ్వాలి
ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్
భాష, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో తెలంగాణ విద్యా విధానం.. సమీక్షలో సీఎం
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్‌ను గేట్ వే ఆఫ్ డ్రగ్స్‌గా మార్చారని.. ఆ సంస్కృతిని రూపుమాపి, డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఈగల్ ఫోర్స్‌ను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫాంహౌజ్‌లను డ్రగ్స్, గంజాయికి కేంద్రాలుగా మార్చితే.. ఎంతటివారైనా, ఫాంహౌజ్‌లో ఉన్నా, ఏ బొక్కలో దాక్కున్నా లాక్కొచ్చి కటకటాల్లో వేస్తామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం ప్రసంగించారు. ‘‘ఇటీవల 138 దేశాలు పాల్గొన్న ‘వరల్డ్ పోలీస్ సదస్సు’ మాదకద్రవ్య నియంత్రణ కేటగిరీలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకార ణం. గంజాయి, డ్రగ్స్ విషయంలో ఎంత పెద్ద వారున్నా, ఎవరి మిత్రులున్నా, ఎవరి బంధువులున్నా వదిలేది లేదు. రాజకీయాల్లో హోదాలున్న వారికి బంధువులుండొచ్చు.. ఆ బంధువులకు ఫాంహౌజ్‌లు ఉండొచ్చు.. కానీ ఆ ఫాంహౌజ్‌లను డ్రగ్స్‌కు కేంద్రాలుగా మార్చి దందా చేస్తామంటే ఎంతటి వారినైనా మా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది’’ అని తేల్చిచెప్పారు.
గేమ్ చేంజర్‌గా తెలంగాణ రైజింగ్- 2047
తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళిక రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునేవారు, మేధావులు ఈ ప్రణాళిక కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. డిసెంబర్ 9 నాటికి ప్రణాళికను ప్రజలకు అందిస్తామన్నారు. అది తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చబోతోందని, యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతోందని చెప్పారు. శంషాబాద్‌కు కూతవేటు దూరంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా.. ఆర్థిక రంగంలో నిలదొక్కుకునేలా చేస్తుందన్నారు. కానీ కొంతమంది అసూయ, అక్కసుతో ప్రజలను రెచ్చగొట్టి, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్ట పరిహారం అందించి ఆదుకుంటామని చెప్పారు. అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తమ ప్రభుత్వంలో తావు లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కష్టమైనా, నష్టమైనా ప్రజలతో ప్రతీదీ పంచుకుంటున్నామన్నారు. ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకుంటున్నామని చెప్పారు. విద్యనే మనందరి విజయానికి వజ్రాయుధమని నమ్ముతున్నామని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలని, ఈ ఏడాదిలోనే నాలుగున్నర లక్షల మంది పేదలు సొంతింటి వారవుతున్నారని సీఎం చెప్పారు. 2027 డిసెంబర్ 9 నాటికి ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
రాచరికానికి ఘోరీ కట్టి, ప్రజా పాలన వచ్చిన రోజు..
తెలంగాణలో రాచరికానికి ఘోరీ కట్టి, ప్రజా పాలనకు హరతి పట్టిన రోజు సెప్టెంబర్ 17 అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వం సంకెళ్లను బద్దలుకొట్టి స్వేచ్ఛకు ఊపిరిపోయడానికి వందలాది మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి నియంతృత్వ నిర్బంధంలోకి జారిపోయిన తీరును గడిచిన పదేళ్లలో చూశామన్నారు.
విద్యా రంగం సమూల ప్రక్షాళనే మా ధ్యేయం: సీఎం రేవంత్
మూడేళ్ల డిగ్రీ, నాలుగేళ్ల ఇంజనీరింగ్ బోధించి పట్టాలిచ్చి పంపే చదువులతో ఎవరికీ ఉపయోగం లేదని, ఉద్యోగాలిచ్చే చదువులు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశలో విద్యా రంగాన్ని సమూల ప్రక్షాళన చేసి, నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ అంశంపైౖ బుధవారం సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘‘ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి దగ్గర జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్న చోట భాష లేదు. రెండూ ఉన్న చోట నైపుణ్యాలు లేవు. ఇకపై ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలి. క్షేత్రస్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్టు తెలంగాణ విద్యా విధానం రూపొందాలి. అది భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలి’’ అని చెప్పారు. వచ్చే 25 ఏళ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని అధికారులకు సూచించారు. డిసెంబరు 9వ తేదీన ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రంగా వినియోగించుకునేలా కొత్త విధానం ఉండాలని.. ఎంత వ్యయానికైనా వెనకాడబోమన్నారు. సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చాక దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినా.. సరైన నైపుణ్యాలు లేక వాటిని అందిపుచ్చుకోలేక పోతున్నారని సీఎం పేర్కొన్నారు. అందుకే నైపుణ్యాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నామని చెప్పా రు. తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని.. ఉపాధ్యాయులు బోధనపై దృష్టిపెట్టేలా వారికి ప్రమోషన్లు, బదిలీలు కల్పించామని వివరించారు. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమలయ్యేందుకు వివిధ ఫౌండేషన్లు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
నాణ్యమైన విద్య.. నైపుణ్యాల పెంపుపై దృష్టి
విద్యా కమిషన్, ఇతర భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపామని, విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలనేది తమ అభిప్రాయమని తెలంగాణ విద్యా విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ కేశవరావు చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం కొలువుల సాధనకే కాకుండా అత్యుత్తమ మానవుడిగా తీర్చిదిద్దేదిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే ఉన్నత విద్యలో పాఠ్యాంశాలను మార్చామని, పట్టా పొందిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా పారిశ్రామిక సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిస్టారెడ్డి వివరించారు. ఈ సమావేశంలో టీచర్ ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, మల్క కొమరయ్య, ప్రభుత్వ సీఎస్ కె.రామకృష్ణారావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.