Bhatti Vikramarka: అడిగినవన్నీ ఇస్తున్నా.. ఆందోళన ఏంటి
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:40 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘ఉద్యోగులు అడిగినవి ఒక రోజు అటూ ఇటూగా చేస్తూనే ఉన్నాం కదా...
ఒక రోజు అటూ ఇటూగా చేస్తూనే ఉన్నాం కదా?.. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య దూరానికి కారణమేంటి?
వెంటనే పరిస్థితిని చక్కదిద్దండి.. భట్టికి సూచించిన సీఎం రేవంత్
ఉద్యోగ సంఘాలతో భట్టి చర్చలు
కనీస స్పందన లేకపోవడంతోనేఉద్యమ కార్యాచరణ: సంఘాల నేతలు
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘ఉద్యోగులు అడిగినవి ఒక రోజు అటూ ఇటూగా చేస్తూనే ఉన్నాం కదా? అయినా ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దీనికి బాధ్యులు ఎవరు? ఆర్థిక ఇబ్బందుల వల్ల బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరిగినా.. ఎంతో కొంత మేలు జరుగుతూనే ఉందిగా? ఉద్యోగులతో సమావేశం అయ్యాక డిమాండ్ల అమలు కోసం మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. అధికారుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తీసుకున్నాం. ఆ నివేదిక వచ్చాక మంత్రిమండలిలో చర్చించి, చేస్తామని చెప్పిన అంశాలు కూడా ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ సహచరుల వద్ద అసంతృప్తి చేసినట్లు సమాచారం. ఉద్యోగుల ఆందోళనలకు బీజేపీ మద్దతు ప్రకటించి, రాజకీయ లబ్ధి పొందాలనే పరిస్థితి ఎలా వచ్చిందనే చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని సంబంధిత మంత్రి, కార్యదర్శిని పదేపదే కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రధాన కార్యదర్శిని కోరితే స్పందించడం లేదు. జేఏసీ పెట్టిన 63 డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. అందుకే ఈ నెల 19న జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి, కార్యాచరణ ప్రకటించాం. ఉమ్మడి పది జిల్లాల్లో బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించాం’ అని ఉద్యోగ సంఘాల జేఏసీ చెబుతోంది. ఇక ఉద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు తెలపడంతో సీఎం రేవంత్ శుక్రవారంరాత్రి భట్టి విక్రమార్కతో సుమారు మూడు గంటలపాటు చర్చించినట్లు తెలిసింది. శనివారం ఉదయం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన భట్టి.. తొలుత వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అడిగినవన్నీ చేస్తున్నా.. ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. కింది స్థాయిలో ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా సంఘాల నాయకులను అల్లరి చేస్తున్నారని వారు సమాధానమిచ్చినట్లు సమాచారం. దీంతో బీఆర్‌ఎస్ పాలనలో ఉన్న సమస్యలే మళ్లీ కావాలా? అని భట్టి ఉద్యోగులను ప్రశ్నించగా.. ‘అలా వ్యవహరిస్తే మీ ప్రభుత్వానికి కూడా లీడర్లే ఉంటారు తప్ప.. క్యాడర్ ఉండదు’ అని జేఏసీ ప్రతినిధులు బదులిచ్చిట్లు తెలిసింది. శనివారం సమావేశం అర్ధంతరంగా ముగియడంతో సోమవారం మరోసారి భట్టి నుంచి పిలుపొచ్చింది. అయితే జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను ఆపాలని సీఎం సూచించడంతో మంత్రులు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.
నాయకులను గుర్తుపట్టని కొందరు మంత్రులు
ఉద్యోగుల సమస్యలను వివరించేందుకు వెళుతున్న జేఏసీ నాయకులను కొందరు మంత్రులు గుర్తు పట్టడం లేదని సంఘం నాయకుల్లో చర్చ జరుగుతోంది. రెండు కీలక శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ సీనియర్ మంత్రి వద్దకు వెళ్లగా.. ఆయన మీరంతా ఎవరు? అని ప్రశ్నించారని తెలిసింది. మరో మంత్రి వద్దకు వెళ్లగా ఎప్పుడూ మీ సమస్యలేనా? అంటూ అసహనం వ్యక్తం చేయడంతో సంఘాల నేతలు నివ్వెరపోయారు. కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి వద్దకు వెళ్లగా.. కనీసం స్పందించలేదని, వారు చెబుతున్న వివరాలను వినే ఆసక్తి చూపలేదని ప్రచారం జరుగుతోంది. మరో మంత్రి ఏ పథకం ఆపి ఉద్యోగులకు నిధులు ఇవ్వాలో చెప్పాలని ప్రశ్నించడంతో ‘ఏ పథకం ఆపొద్దు. మా నిధులు మాకు ఇవ్వండి’ అని ఉద్యోగ సంఘం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణకు దిగాల్సి వచ్చిందని జేఏసీ చెబుతోంది. మరోవైపు 206 సంఘాలు, 15,20,000 మంది ఉద్యోగులు ఉన్న జేఏసీలో విభేదాలు తలెత్తాయనే ప్రచారం కూడా జరుగుతోంది. 20 నెలలుగా సమస్యల పరిష్కారం విషయంలో ఆశించిన పురోగతి లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నుంచి బయటకు వెళ్లే ప్రతిపాదన చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News