Share News

Tummala: నేడు రైతు నేస్తం ప్రారంభం

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:30 AM

వ్యవసాయ విశ్వవిదాలయ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతులతో మాట్లాడనున్నారు.

Tummala: నేడు రైతు నేస్తం ప్రారంభం

  • వ్యవసాయ వర్సిటీలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • 1,034 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం

  • వ్యవసాయ మంత్రి తుమ్మల వెల్లడి

రాజేంద్రనగర్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విశ్వవిదాలయ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతులతో మాట్లాడనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,034 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం కల్పించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ఆదివారం రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, డైరెక్టర్‌ గోపి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఇప్పటికే 566 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం కల్పించి.. ప్రతి మంగళవారం ‘రైతు నేస్తం’ ద్వారా రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖీ చర్చలను నిర్వహిస్తున్నటు చెప్పారు.


తద్వారా ఆదర్శ రైతుల అనుభవాలు, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను అన్నదాతలకు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న 6.35 లక్షల మంది రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగం, రైతాంగానికి సీఎం రేవంత్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చి ముందుకు సాగుతున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రైతు సంక్షేమానికి రూ.78వేల కోట్లు ఖర్చు చేశామని తుమ్మల వివరించారు. రుణ మాఫీ, సన్న ధాన్యానికి బోనస్‌, మద్దతు ధరనివ్వడంతోపాటు పంటల కొనుగోలు, సబ్సిడీపై సూక్ష్మ సేద్య పరికరాలు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 04:30 AM