CM Revanth Reddy: తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది!
ABN , Publish Date - May 01 , 2025 | 04:01 AM
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. ‘తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది’ అని మరోసారి రుజువైందన్నారు.
కులగణన రాహుల్ గాంధీ ఆలోచన
ప్రధాని మోదీకి ధన్యవాదాలు: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. ‘తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది’ అని మరోసారి రుజువైందన్నారు. కులగణన రాహుల్ గాంధీ ఆలోచన అని, భారత్ జోడో యాత్రలో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. కులగణనను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో తమ ప్రభుత్వం విజయవంతంగా చేసి చూపించిందన్నారు.
ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలిచామని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పోరాడిందని, ఢిల్లీలోనూ ఆందోళన చేసిందని గుర్తుచేశారు. ఇది ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సాధించిన గొప్ప విజయమని కీర్తించారు. కులగణన చేపట్టాలన్న నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.