Share News

CM Revanth Reddy: కేసీఆర్‌.. నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో!

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:29 AM

యూట్యూబ్‌, సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకుని, జర్నలిస్టుల ముసుగు వేసుకొని తన కుటుంబంపై నీచమైన భాష వాడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్న వారిని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

CM Revanth Reddy: కేసీఆర్‌.. నీ కుటుంబాన్ని  అదుపులో పెట్టుకో!

  • ఆడవాళ్లపై పెయిడ్‌ ఆర్టిస్టులతో నీచభాష మాట్లాడిస్తారా?

  • తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాచిక సంస్కృతి తెచ్చారు

  • సమాజానికి ఇదో చీడ పురుగులా మారే ప్రమాదం

  • సోషల్‌ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం

  • జర్నలిస్టు ముసుగేసినా క్రిమినల్‌గానే చూస్తాం

  • అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ఫైర్‌

  • దుబాయ్‌ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): యూట్యూబ్‌, సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకుని, జర్నలిస్టుల ముసుగు వేసుకొని తన కుటుంబంపై నీచమైన భాష వాడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్న వారిని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కిరాయి మూకలను అడ్డం పెట్టుకొని పథకం ప్రకారం చేపడుతున్న ప్రచారం వెనుక కేసీఆర్‌ కుటుంబం ఉందని, ఆయనే వాళ్లను అదుపులో పెట్టుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇలాంటి పైశాచిక పోకడలను ప్రోత్సహిస్తే ఎవ్వరినీ వదిలేది లేదని, ఉప్పు పాతర వేయడం ఖాయమని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన ఓపిక నశించిందని తెలిస్తే లక్షల మంది అభిమానులు రోడ్ల మీదకు వచ్చి ఒక్కొక్కడినీ గుడ్డలూడదీసి కొడతారని హెచ్చరించారు. ప్రజాజీవితంలో ఉన్న వారిని నీచమైన భాషతో మానసికంగా దెబ్బతీసి ప్రయోజనం పొందాలని చూస్తున్న వారికి చెక్‌ చెప్పడం కోసం అవసరమైతే చట్టాన్ని సవరిస్తామని శనివారం సభాముఖంగా ప్రకటించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ఇంటి ఆడపడుచులను నీచమైన భాషలో నిందిస్తూ మాట్లాడించి, వాటిని ఆడపిల్లల సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా పోస్టింగులు చేయించడంపై తీవ్ర భావోద్వేగంతో స్పందించారు.


యూట్యూబ్‌ ఛానళ్లు, సోషల్‌ మీడియా కట్టడికి సంబంధించి సభలో ఒకరోజు చర్చ జరపాలని పిలుపునిచ్చారు. పెయిడ్‌ ఆర్టిస్టుల్ని పార్టీ ఆఫీసులో పెట్టి, తిట్లను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే బీఆర్‌ఎస్‌ వారికి ఎందుకు దుఃఖం వస్తోందని ప్రశ్నించారు. ఇదే కేసీఆర్‌ 2014-15 మధ్యకాలంలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ 9, ఏబీఎన్‌లలో చిన్న సన్నివేశం ప్రసారం చేస్తే ఏకంగా ఏడాది కాలం బ్యాన్‌ చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టుల ముసుగు వేసుకున్న కొందరు వ్యక్తులు తమ ఎకౌంట్లలో పెడుతున్న భాష వింటుంటే తన రక్తం మరుగుతోందన్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నామని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం కుటుంబ సభ్యుల్ని అంత మాటలంటున్నారంటే మీరు మనుషులేనా? మీకు భార్యబిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, చెల్లినో, భార్యనో ఈ రకంగా మాట్లాడితే వింటావా? అరె్‌స్టను ఖండిస్తూ ట్విట్టర్‌ పోస్టును పెట్టిన వారిని(కేటీఆర్‌) ప్రశ్నిస్తున్నా. నా భార్యను, నా బిడ్డను తిడితే నాకు నొప్పి అయితది. ఒక ఆడబిడ్డను అవమానిస్తే మీకు నొప్పి కాదా? మనం ఏ సంస్కృతిలో ఉన్నాం’’ అని విపక్షాన్ని నిలదీశారు.


ప్రజాజీవితంలో ఉన్న నేతలను విమర్శించడంలో తప్పులేదని, దాన్ని వదిలేసి, ఇంట్లో ఉండే ఆడోళ్ల గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ పోరాట సంస్కృతిని సర్వనాశనం చేసి విష సంస్కృతిని తెచ్చి, నోటికొచ్చింది మాట్లాడించి పోస్ట్‌ చేస్తున్నారన్నారు. ‘‘వారు తిట్టిన తిట్లకు నా పేరు తీసేసి మీ పేరు రాసుకోండి అక్కడ. మీకు అన్నం తినబుద్ది అయితదో నేను చూస్తా’’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి బలహీనుడు కాదని, ఓపిక పట్టి, మర్యాద కోసం ఉంటున్నానని గ్రహించాలని చెప్పారు. ‘‘కేసీఆర్‌, మీ పిల్లలకు బుద్ది చెప్పండి. ఇది మంచిది కాదు. మాట జారితే దాని ఫలితం ఎలా ఉంటదో అనుభవిస్తారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని పదవికోసం లాలూచీ పడి దిగజారే రాజకీయాలు చేయను. ఉన్నంత కాలం నిటారుగా ఉంటా. ఏదీ పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకోను. కోర్టుకు పోతే బెయిలొస్తది, చేతనైనంత వరకు మానసికంగా దెబ్బతీసి ప్రయోజనం పొందాలనుకుంటున్నారేమో. అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ల ప్లాట్‌ఫామ్‌లలో పోస్టు చేయడం మంచిదా? తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా? ఉద్యమ సమయంలోనూ ఈ తరహా భాషాప్రయోగం జరగలేదు’’ అన్నారు.


జర్నలిస్టులెవరో గుర్తించండి

రాష్ట్రంలో జర్నలిస్టులెవరో మీడియా సంఘాలే గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. వాళ్ల లిస్టులో ఉన్న జర్నలిస్టులు తప్పు చేస్తే ఏ శిక్ష వేయాలో సంఘాలే చెప్పాలని కోరారు. జాబితాలో లేనివాడు జర్నలిస్టు ముసుగు వేసుకొని వస్తే కిమినల్స్‌కు ఎలా జవాబు చెప్పాలో గట్లనే చెబుతామని, గుడ్డలు ఊడదీసి కొడతా అని ఘాటుగా హెచ్చరించారు. తానూ మనిషినేనని, చీమూ నెత్తురూ ఉందని, సీఎం కుర్చీలో ఉన్నందుకు అన్నింటినీ భరిస్తాననే భ్రమలు పెట్టుకోవద్దని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో చట్ట పరిధిలోనే అన్ని శిక్షలూ పడేట్లు చూస్తామని చెప్పారు. ‘‘ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి. భవిష్యత్తులో ఇది తెలంగాణకు చీడ పురుగులా మారుతుంది. దీనిపై సభలో చర్చిద్దాం. ఒక చట్టాన్ని చేద్దాం. సభాపతి ఆదేశిస్తే సంబంధిత మంత్రి జర్నలిస్టు సంఘాలను పిలిచి మాట్లాడతారు. ఒక మంచి సంప్రదాయానికి తెలంగాణ వేదిక కావాలి. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే’’ అన్నారు.


దుబాయ్‌ రికార్డులు ఉన్నాయ్‌

ఫాంహౌ్‌సల్లో డ్రగ్స్‌ పార్టీలు, కోళ్ల పందాలు సహించేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. జన్వాడ ఫాంహౌ్‌సలో డ్రగ్స్‌ పార్టీలు, ఫాంహౌ్‌సల్లో కోళ్ల పందాలు నిర్వహించిందెవరో తెలుసునన్నారు. దుబాయ్‌లో డ్రగ్స్‌ తీసుకుని చనిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడని సీఎం సీఎం ప్రశ్నించారు. మిత్రుడు చనిపోతే శవాన్ని కూడా ఇక్కడికి తీసుకురాకుండా దుబాయ్‌ వెళ్లి పైరవీలు చేసి అక్కడే దహనం చేయించిన చరిత్ర ఎవరిది అని అడిగారు. సదరు వ్యక్తి సభకు వస్తే అన్ని వివరాలు అప్పుడు చెబుతానన్నారు. మొత్తం రికార్డులు దుబాయ్‌ నుంచి తెప్పించానని, అన్ని గుట్లు, మట్లు తన దగ్గర ఉన్నాయని వ్యాఖ్యానించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్నీ ముందు పెడతానని చెప్పారు.


అబద్దాలు తిని బతుకుతున్నారా?

కేసీఆర్‌ కుటుంబం మొత్తం అబద్దాల మీదే బతుకుతోందని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకుని చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారన్నారు. ఎక్కడైనా ఎవరైనా చనిపోయారని టీవీలు, పేపర్లలో వస్తే తలుపులు మూసుకుని తాండవం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా తాను చేసే ఖర్చులకు పక్కాగా లెక్క ఉంటుందని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ దేవుళ్లకు మొక్కుకుంటే వ్యక్తిగత విషయానికి ప్రభుత్వ సొమ్ము నుంచి మొక్కులు చెల్లించారని, కిలోల కొద్దీ బంగారం ఇచ్చారని ప్రస్తావించారు. కేసీఆర్‌ ఎక్కడికెళ్లినా చార్టెడ్‌ ఫ్లైట్‌లోనే తిరిగారని చెప్పారు.

Updated Date - Mar 16 , 2025 | 03:29 AM