Share News

ఢిల్లీ పైరవీలతో పదవులు రావు

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:44 AM

ఢిల్లీ నుంచి పైరవీలతో కాకుండా గల్లీలో పేదల కోసం పని చేసే వారినే పదవులు వరిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. డబ్బులతో కాకుండా నిత్యం ప్రజల్లో ఉండే వారినే గెలుపు వరిస్తుందని చెప్పారు.

ఢిల్లీ పైరవీలతో పదవులు రావు

  • పేదల కోసం పని చేస్తేనే వరిస్తాయి

  • యువజన కాంగ్రె్‌సకు రేవంత్‌ ఉద్బోధ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14, (ఆంఽరఽధజ్యోతి): ఢిల్లీ నుంచి పైరవీలతో కాకుండా గల్లీలో పేదల కోసం పని చేసే వారినే పదవులు వరిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. డబ్బులతో కాకుండా నిత్యం ప్రజల్లో ఉండే వారినే గెలుపు వరిస్తుందని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్‌ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. పార్టీ అనుబంధ విభాగాల్లో బాధ్యత తీసుకున్న వారికి ప్రభుత్వంలో స్థానం కలిపిస్తామన్న మాట నిలబెట్టుకున్నామని, 37 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను అనుబంధ విభాగాలకు అందించామని ప్రస్తావించారు. రాజకీయ రంగ ప్రవేశానికి యువజన కాంగ్రెస్‌ మొదటి మెట్టు అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కేసీఆర్‌లు అక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించారని చెప్పారు. కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలా జెండాను మోసి రాష్ట్రంలో కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చారన్నారు. అలాంటి వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు దక్కేలా చూస్తామని ప్రకటించారు.


ఏడాదిలో55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రైౖతులకు రుణమాఫీ చేశామని, కేసీఆర్‌ ఎగ్గొట్టిన రైతు బంధు వేశామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. మోదీ మందకృష్ణను ఎన్నోసార్లు కౌగలించుకున్నారని, అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలిందని వ్యాఖ్యానించారు. కొడితే గట్టిగా కొడతానని ప్రతిజ్ఞలు చేస్తున్న కేసీఆర్‌ ముందుగా దుర్మార్గంగా ప్రజలను దోచుకున్న కొడుకును, అల్లుడిని, బిడ్డను కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కేటీఆర్‌, కేజ్రీవాల్‌ను కవిత ఓడించారని వ్యాఖ్యానించారు. కుర్చీలో ఉన్నప్పుడే ప్రజలు కేసీఆర్‌ను బండకేసి కొట్టి ఓడించారని, ఇప్పుడు బయటికొచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ఛానెళ్లు, పత్రికలు బీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్నపుడే కాంగ్రె్‌సను ఏమీ చేయలేక పోయారని, ఇప్పుడు సోషల్‌ మీడియా దుష్ప్రచారంతో ఏదో చేయగలమనుకుంటే భ్రమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్వని మోదీపై పోరాటానికి సిద్దమని ఉద్ఘాటించారు. సమయం ఇవ్వాలని సంయమనం పాటిస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.

Updated Date - Feb 15 , 2025 | 03:44 AM