CM Revanth Reddy: అధిక వడ్డీలతో అల్లాడిపోతున్నాం!
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:46 AM
సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్‌తో సీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ ఎస్.మహేంద్రదేవ్ ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరువురి మధ్యపలు అంశాలతో పాటు తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే విషయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని తెలిపారు. పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్రానికి కంపెనీలు వస్తాయని అన్నారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల గురించి మహేంద్రదేవ్ దగ్గర ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శాతం వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని, చెల్లింపులకు ఇబ్బంది అవుతోందని వివరించారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు.
14 నుంచి రేషన్ కార్డుల పంపిణీ
తుంగతుర్తిలో ప్రారంభించనున్న సీఎం
రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలకు చేరుతుందని, ఫలితంగా లబ్ధి పొందే కుటుంబ సభ్యుల సంఖ్య 2.81 కోట్ల నుంచి 3.09 కోట్లకు పెరుగుతుందని తెలిపారు. కొత్త కార్డుల జారీ వల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా నెలకు రూ.95.89 కోట్ల భారం పడనుందని, ఏడాదికి ఇది రూ.1,150.68 కోట్లు అవుతుందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి