ప్రగతి దిశగా ముందడుగు
ABN , Publish Date - May 24 , 2025 | 04:00 AM
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు ఢిల్లీ వేదికగా ఆవిష్కృతం కానున్నాయి. 2047 నాటికి తెలంగాణ సాధించదలచుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ను సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం వేదికగా ఆవిష్కరించనున్నారు.
నేడు ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ ఆవిష్కరణ.. నీతి ఆయోగ్ భేటీలో ఆవిష్కరించనున్న రేవంత్
ప్రధాని మోదీతో కలిసి అల్పాహారం చేయనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు ఢిల్లీ వేదికగా ఆవిష్కృతం కానున్నాయి. 2047 నాటికి తెలంగాణ సాధించదలచుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ను సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం వేదికగా ఆవిష్కరించనున్నారు. దీంతోపాటు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై తెలంగాణ తరఫున ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. ‘వికసిత్ రాజ్య్.. వికసిత్ భారత్’ ఎజెండాగా ఢిల్లీలోని భారత మండపంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో తె లంగాణ అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఏ విధంగా ముందుకు వెళ్తున్నామనే అంశంతోపాటు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న ‘తెలంగాణ రైజింగ్’ నినాదం గురించి సీఎం తెలియజేస్తారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా చేపడుతున్న పనుల గురించి కూడా వివరించనున్నారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఔషధ రంగం, పట్టణీకరణలో ఇప్పటికే తెలంగాణ ముందుందని, ఆయా రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలపనున్నారు.
ప్రభుత్వ పథకాలపై వివరణలు..
వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగంగా రైతులకు చేసిన రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, సన్నబియ్యం పంపిణీ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు పథకం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల గురించి వివరించనున్నారు. వీటితోపాటు రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్లు, డ్రైపోర్టు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ప్రపంచస్థాయి సౌకర్యాలతో విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై ప్రసంగిస్తారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. శనివారం భారత్ మండపంలో ప్రధాని మోదీతోపాటు పలువురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి సీఎం రేవంత్ అల్పాహారం చేయనున్నారు. ఆ తరువాత ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి గ్రూప్ ఫొటో కార్యక్రమంలో పాల్గొనున్నారు. కాగా, 2018 తరువాత నీతి ఆయోగ్ సమావేశానికి తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ తరఫున హాజరవుతున్నారు.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్‌లోంచి..