Share News

CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు

ABN , Publish Date - May 08 , 2025 | 04:18 AM

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో అత్యవసర సర్వీసుల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు.

CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు

  • రాష్ట్రంలో పూర్తి అప్రమత్తత

  • ఐటీ, రక్షణ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం

  • పాక్‌, బంగ్లా అక్రమ వలసదారుల్ని పట్టుకోండి

  • అత్యవసర మందులు అందుబాటులో ఉండాలి

  • నేడు కొవ్వొత్తుల ర్యాలీ: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో అత్యవసర సర్వీసుల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. భారతీయులంతా ఆర్మీకి బాసటగా నిలవాలని కోరారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా ఉండాల్సిన సమయమని చెప్పారు. ముఖ్యమంత్రి బుధవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశ రక్షణలో హైదరాబాద్‌ వ్యూహాత్మక ప్రాంతం కావడంతో పాటు అనేక రక్షణ సంస్థలు ఉండడం, ఐటీకి కేంద్రమైన నేపథ్యంలో తాజా పరిస్థితులపై అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండేలా దిశా నిర్దేశం చేశారు. మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలు ముందే ఖరారైనవి ఉంటే తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్‌ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి అక్రమ మార్గాల్లో వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారెవరైనా ఉంటే తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఇవ్వాలని సూచించారు. సైబర్‌ దాడులు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని, అన్ని జిల్లా కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు.


ఐటీ, డిఫెన్స్‌ సంస్థల సమీపంలో భద్రతను పెంచి నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ఒక కన్ను వేసి ఉంచాలని, శాంతి సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ‘బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలను సిద్ధం చేసుకోవాలి. అత్యవసర మందులు అందుబాటులో పెట్టుకోవాలి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో ఎన్ని బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలి. రెడ్‌క్రాస్‌తో సమన్వయం చేసుకుంటూ వెళ్లాల’ని సూచించారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో డీజీపీ జితేందర్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, హోం శాఖ కార్యదర్శి రవిగుప్తా, ఆర్మీ, విపత్తు నిర్వహణ, సంబంధిత ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మాక్‌ డ్రిల్‌ను సీఎం పర్యవేక్షించారు. అంతకుముందు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఫోన్‌ చేసి వెంటనే హైదరాబాద్‌ వచ్చేయాలని సీఎం సూచించారు.


సోషల్‌ మీడియాపై నిరంతర నిఘా

సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించే పోస్టుల విషయంలో సునిశిత దృష్టితో వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌ శిఖాగోయల్‌ నేతృత్వంలో ఆ విభాగం నిరంతరం నిఘా ఉంచాలన్నారు. రెచ్చగొట్టే పోస్టులు, మతాలకు సంబంధించి చేసే పోస్టింగులపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు విభాగాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంవోకు చేరవేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో దేశం ఐక్యంగా దృఢ సంకల్పంతో నిలబడిందని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో బుధవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు.


రాష్ట్రంలో హై అలర్ట్‌..

  • జిల్లా ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ సమీక్ష

  • ఆపరేషన్‌ అభ్యాస్‌ పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్స్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మే 7 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో తెలంగాణలో హైఅలర్ట్‌ ప్రకటించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో గస్తీ పెంచారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా జిల్లా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బుధవారం జిల్లా ఎస్పీలు, కమిషనర్లతో సమీక్ష సందర్భంగా డీజీపీ జితేందర్‌ సూచించారు. దాడుల నుంచి తమను తాము కాపాడుకునేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పోలీసులను ఆదేశించారు. వదంతులు వ్యాపించకుండా సోషల్‌ మీడియాను పర్యవేక్షించాలని, ఫేక్‌న్యూస్‌పై ఫ్యాక్ట్‌చెక్‌తో వాస్తవాలను ప్రజల ముందుంచాలని జితేందర్‌ తెలిపారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆపరేషన్‌ అభ్యాస్‌ పేరుతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు. 54ఏళ్ల తర్వాత నగరంలో యుద్ధ సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. యుద ్ధ సమయంలో సైనిక చర్యలు జరిగినప్పుడు ప్రజలు ఎలా వ్యవహరించాలన్నదానిపై నానల్‌నగర్‌, కంచన్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌, ఎన్‌ఎ్‌ఫసీ ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించారు.

Updated Date - May 08 , 2025 | 05:36 AM