CM Revanth Reddy: సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:42 AM
CM Revanth Reddy: అహింసా పద్ధతిలో మహాసంగ్రామం గెలిచామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరిగిన 79వ స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అహింసా పద్ధతిలో మహాసంగ్రామం గెలిచామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ పటిష్ట భారత్ కోసం నెహ్రూ ఎన్నో చర్యలు చేపట్టారు. నెహ్రూ హయాంలోనే దేశ ప్రగతికి బలమైన పునాదులు పడ్డాయి. పంచవర్ష ప్రణాళికతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారు.
తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాము. కులగణనతో వందేళ్ల కల నెరవేర్చాం. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నాం. సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి. సన్నబియ్యం పంపిణీతో పేదల కళ్లలో ఆనందం చూశాం. వరంగల్‌లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ నెరవేర్చాం. 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. రైతులకు క్వింటాల్‌పై 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఏటా ఉచిత విద్యుత్ కోసం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం’ అని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం
సీఎం రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించాం. గ్రూప్- 1 లో 15, గ్రూప్ -2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించాం. మసకబారిన ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం.
27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం.
ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది. యువత తెలంగాణ శక్తికి ప్రతీక. గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రను మేం చేధించాం. ఇవ్వాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూల మూలలా నిశితంగా నిఘా పెట్టింది. డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
భారత్‌కు స్వంతంగా ఓ అంతరిక్ష కేంద్రం.. ఎర్రకోట నుంచి ప్రధాని కీలక వ్యాఖ్యలు..