CM Revanth Reddy: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగాకొత్త ప్రాజెక్టుల అలైన్‌మెంట్లు
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:24 AM
విష్యత్తు అవసరాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక కేంద్రాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు..
విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టుల అనుసంధానం
పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల పూర్తికి సహకరిస్తాం
రీజినల్ రింగ్ రైలు హైదరాబాద్ స్వరూపాన్నే మార్చనుంది
దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు అవసరాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక కేంద్రాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలను అందిస్తూ, ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా రైల్వే నూతన ప్రాజెక్టుల అలైన్‌మెంట్లు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆ శాఖ అధికారులకు సూచించారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునిక విధానంలో అభివృద్థి చేయాలని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతోపాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని.. అందుకు అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూసేకరణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హాజరైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతో.. నూతనంగా ప్రతిపాదించిన ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. కొత్తగా ప్రభుత్వం అభివృద్థి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్‌ల గ్రీన్‌ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. దీనిపై ఇప్పటికే 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను సైతం రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిందన్నారు.
ప్రతిపాదనలకు అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని.. రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్‌మెంట్‌తో పాటు రాష్ట్రప్రభుత్వం సిద్థం చేసిన అలైన్‌మెంట్‌లను పరిశీలించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. హైవే వెంట రైలు మార్గం ఉండాలని, హైవేకు ఇరువైపులా 1.5 కిలోమీటర్ల దూరం వరకూ పారిశ్రామిక కారిడార్‌ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు. కొత్తగా అభివృద్థి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగుళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగురైలు భవిష్యత్‌లో రవాణా అవసరాలకు కీలకమవుతుంద ని... ట్రిపుల్ ఆర్ వెంట రింగు రైలు ఏర్పాటుతో రాజధాని స్వరూపం మారిపోతుందని పేర్కొన్నారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని.. గద్వాల-డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలని కోరారు. భూపాలపల్లి నుంచి వరంగల్‌కు కొత్త మార్గాన్ని పరిశీలించాలని సూచించారు. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్థి పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్ అభివృద్ధి అయ్యేలా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
For More TG News And Telugu News