Share News

CM Revanth Reddy: రోజంతా ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - May 04 , 2025 | 03:45 AM

జాతీయ స్థాయిలో కులగణన, పహల్గాం ఘటనలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి శుక్రవారం ఢిల్లీకి చేరిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండో రోజంతా హస్తినలోనే గడిపారు.

CM Revanth Reddy: రోజంతా ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి

  • కొందరు కాంగ్రెస్‌ నేతలతో లంచ్‌

  • చివరి నిమిషంలో రద్దయిన కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్లు!

  • రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు..

న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో కులగణన, పహల్గాం ఘటనలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి శుక్రవారం ఢిల్లీకి చేరిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండో రోజంతా హస్తినలోనే గడిపారు. శుక్రవారం రాత్రికే హైదరాబాద్‌ చేరుకుంటారని సీఎం సన్నిహిత వర్గాలు చెప్పినప్పటికీ, ఆయన మాత్రం ఢిల్లీలోనే ఉన్నారు. శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌ మల్లు రవితో సుమారు గంటకుపైగా సీఎం మాట్లాడారు. ఆ తర్వాత సుమారు 2.30 సమయంలో ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో మధ్యాహ్నం భోజనం చేశారు.


సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓ ఎంపీ, ఎప్పుడూ సీఎం వెంటే ఉండే మరో కాంగ్రెస్‌ నేత.. మరికొందరు కూడా సీఎంతో ఈ లంచ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం రాత్రి ఢిల్లీ నుంచి సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, తెలంగాణకు రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులకు సంబంధించి కొందరు కేంద్రమంత్రులను కలిసేందుకు సీఎం ప్రయత్నించారని, కానీ చివరినిమిషంలో వారి అపాయింట్‌మెంట్లు రద్దయ్యాయని సమాచారం. అందుకే శనివారం రాత్రి వరకు సీఎం ఢిల్లీలోనే ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ఒకరు ధ్రువీకరించారు.

Updated Date - May 04 , 2025 | 03:45 AM