Gig Workers: కార్మికులకు కానుక!
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:17 AM
అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజున గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

మే డే నుంచి గిగ్ వర్కర్ల భద్రత చట్టం
ముసాయిదాపై అభిప్రాయం సేకరించండి
దేశానికే మార్గదర్శకంగా ఉండాలి: సీఎం
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజున గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, వీరికి సంబంధించిన బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని, అన్ని వర్గాల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. అధికారులు పూర్తి సాయిలో కసరత్తు చేసి ఈ నెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. గిగ్ వర్కర్ల యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ రూపొందించిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ బిల్లులోని అంశాలను అధికారులు సమావేశంలో వివరించారు. దీనిలో పలు మార్పులు చేర్పులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వటంతోపాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయంగా కొత్త చట్టం ఉండాలని నిర్దేశించారు. బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్‌లైన్‌లో ఉంచి, ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆదేశించారు. ‘‘గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చాం. దేశంలోనే మొదటిసారిగా వారికి ప్రమాద బీమాను అమలు చేశాం. ఎవరైనా మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించేలా 2023 డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేశాం. కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి మార్గదర్శకంగా ఉండాలి’’ అని సూచించారు. కాగా ముఖ్యమంత్రి సూచనతో ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయం, సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు కార్మిక శాఖ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 28న సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్దేశించింది. ఈ మేరకు బిల్లు సైట్‌లో అందుబాటులో ఉందని, ఎవరైనా తమ అభిప్రాయాలను ఈ-మెయిల్ ద్వారా లేదా ‘గిగ్ వర్కర్స్ బిల్లుపై సలహాలు’ పేరిట హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం, టీఏకేఎస్ భవన్‌కు నేరుగా పంపవచ్చని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ
UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
For AndhraPradesh News And Telugu News