CM Revanth Reddy: బడుల్లో ముఖ గుర్తింపు హాజరు!
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:53 AM
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు అందించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
కళాశాలల్లోనూ తప్పనిసరి చేయండి
మధ్యాహ్న భోజనం బిల్లులు ఆగొద్దు
ఆటలకు కాంట్రాక్టు ఉపాధ్యాయులు
విద్యారంగంలో మౌలిక వసతుల కోసం
రుణాలకు నిర్మలమ్మను అనుమతి అడిగాం
ప్రభుత్వ బడుల్లో 90 శాతం విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే పదేళ్ల గణాంకాలతో నివేదిక ఇవ్వండి
విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు అందించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ విధానంతో హాజరు శాతం మెరుగుపడి, సాంకేతిక విద్యా కళాశాలల్లో లోటుపాట్లను సరిదిద్దడానికి అవకాశం దొరుకుతుందని చెప్పారు. విద్యారంగంపై పెడుతున్న ఖర్చును తాము పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. శుక్రవారం విద్యాశాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు బాగా పెంచాలని పిలుపునిచ్చారు. అదనపు గదులు, వంట గదులు, మూత్ర శాలలు, మరుగుదొడ్లు, ప్రహారీల నిర్మాణం వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదని, నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనానికి వీలుగా ఒకే విభాగం కిందకు తేవాలని ఆదేశించారు. ‘యంగ్ ఇండియా’ సమగ్ర గురుకుల పాఠశాలల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్థి సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్, ఇతర సిబ్బందిని వెంటనే డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా గ్రీన్ ఛానల్‌లో చేపట్టాలని, చెల్లింపుల్లో ఎలాంటి అలసత్వం చూపొద్దని కోరారు. మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం వంటకాల కోసం కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని, వాటిపైన సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అవసరమైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుద్థ్య పనుల బిల్లులు తక్షణమే విడుదల చేయాలన్నారు. బాలికల గురుకుల పాఠశాలల్లో మహిళా కౌన్సెలర్లను నియమించాలని సూచించారు. యంగ్ ఇండియా పాఠశాలలతో పాటు విద్యారంగం అభివృద్థికి తీసుకునే రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనని, ఈ విషయాన్ని నిర్థారించేందుకు గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారి వివరాలతో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..