CM Revanth Reddy: రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పండి
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:13 AM
రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దీనిని సమర్థంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించండి.

భూ భారతిని సమర్థంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి
మండల స్థాయి సదస్సులకు మీరు వెళ్లాల్సిందే
జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ‘‘రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఎంతో అధ్యయనంతో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దీనిని సమర్థంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించండి. ప్రతి కలెక్టర్ మండల స్థాయి సదస్సులకు హాజరు కావాలి. అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమయ్యే భాషలోనే జవాబు ఇవ్వండి. వాటికి పరిష్కారాలూ చూపండి’’ అని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగునీటి ప్రణాళికపై ఆయన దిశానిర్దేశం చేశారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, వీటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. ‘‘భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోండి. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయండి. రైతులు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేలా పట్టు సాధించండి. అప్పుడే వారిలో ఆందోళన తగ్గుతుంది. రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను గతంలో న్యాయస్థానాలకు పంపారు. భూ భారతి చట్టంలో రెవెన్యూ యంత్రాంగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఇందులో అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు, ప్రజలకు వివరించండి’’ అని నిర్దేశించారు. పైలెట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని, వాటికి కలెక్టర్లు హాజరు కావాలని, ఆయా మండలాల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా సదస్సులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికో ప్రత్యేకాధికారి
ఇన్‌చార్జి మంత్రులు ఆమోదించిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్ల జాబితా ఖరారవుతుందని, గ్రామస్థాయిలో ఆమోదించిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని, ఆ తర్వాతే ఇన్‌చార్జి మంత్రికి పంపాలని రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రక్రియ పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ కమిటీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రి మధ్య ప్రత్యేకాధికారులు సమన్వయకర్తగా ఉంటారన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గొద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి కమిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సూచించారు. నిర్దిష్ట గడువు పెట్టుకుని ఇళ్లను నిర్మించాలని, ఇందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్థ చూపాలన్నారు. భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరు ఆధారంగానే పదోన్నతులు, బదిలీలు ఉంటాయని కలెక్టర్లకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వీటి అమల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మ్యుటేషన్లు, వారసుల మధ్య వివాదాలను పరిష్కరించాలన్నారు.
తాగు నీటి సమస్య రావద్దు
వేసవిలో ఎక్కడా తాగు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో తాగు నీటి వనరులు, సరఫరాను డ్యాష్ బోర్డు ద్వారా కలెక్టర్లు పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్య తలెత్తితే పరిష్కారానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల పేర్లను ప్రస్తావించారు. ఈ సమయంలో.. తన నియోజకవర్గంలోనూ కొన్ని మండలాలు, గ్రామాలకు నీటి సరఫరా లేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. పైపులైన్లు, మోటార్లు, బోర్ల మరమత్తులకు కలెక్టర్లకు ఇప్పటికే నిధులు కేటాయించామని, అవసరమైతే మరిన్ని ఇస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా మోటార్లు కాలిపోయినప్పుడు లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు కలెక్టర్లు వెంటనే సీఎ్‌సకి సమాచారం అందజేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని సీఎ్‌సను రేవంత్ ఆదేశించారు.
అవసరమైతే.. ల్యాండ్ ట్రైబ్యునళ్లు
భూ సమస్యల పరిష్కారానికి అవసరమైతే ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని, దానిపై కూడా ఆలోచన చేస్తున్నామని కలెక్టర్లతో సీఎం రేవంత్ చెప్పినట్లు తెలిసింది. దీని ఏర్పాటుతో భూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. భూ భారతి చట్టానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే వెంటనే ఉన్నతాఽధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో సీఎం రేవంత్ నవ్వుతూ మాట్లాడుతూనే.. కలెక్టర్లకు చురకలు అంటించారని తెలిసింది.
పాసుబుక్కుపై భూమి సరిహద్దులతో పటం!
భవిష్యత్తులో పట్టాదారు పాసు పుస్తకాలపై భూమి సరిహద్దులతో కూడిన పటం (మ్యాప్)ను ఉంచాలని ఆలోచిస్తున్నామని కలెక్టర్లతో సీఎం రేవంత్ అన్నట్లు తెలిసింది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు. సర్వేయర్లను నియమించి, వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత సరిహద్దులకు సంబంధించిన అంశాలపై స్పష్టత వస్తుందని అన్నట్టు సమాచారం. పాసు బుక్కుల్లోనే భూమి సరిహద్దుతో కూడిన మ్యాప్ ఉంటే వివాదాలు ఉండబోవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ
UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
For AndhraPradesh News And Telugu News