Share News

CM Revanth Reddy: అమెరికా స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:10 AM

అమెరికాకు, తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఎంతో సారూప్యత ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటమిని అంగీకరించకుండా, ఎప్పుడూ బలమైన దేశంగా అనేక అంశాల్లో అమెరికా సానుకూల మార్గంలో పరిష్కారాలను చూపిందని చెప్పారు.

CM Revanth Reddy: అమెరికా స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి

  • రాష్ట్రం, అమెరికా మధ్య సారూప్యతలెన్నో..

  • 2035 నాటికి ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

  • అమెరికా నుంచి అధిక పెట్టుబడులు రావాలి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అమెరికాకు, తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఎంతో సారూప్యత ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటమిని అంగీకరించకుండా, ఎప్పుడూ బలమైన దేశంగా అనేక అంశాల్లో అమెరికా సానుకూల మార్గంలో పరిష్కారాలను చూపిందని చెప్పారు. తెలంగాణ కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తూ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. హోటల్‌ తాజ్‌కృష్ణలో శుక్రవారం జరిగిన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతర ఆవిష్కరణలతో అమెరికా.. ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందని చెప్పారు. 2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ఏర్పాటైందని గుర్తుచేశారు. భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించిందని, తెలుగు ప్రజలతో స్నేహపూర్వక బంధాన్ని కలిగి ఉందని చెప్పారు.


హైదరాబాద్‌లోని కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ రెండు దేశాల సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య సంబంధాలను పటిష్ఠపర్చడంలో వారధిగా నిలుస్తున్నారని అభినందించారు. ఐటీ, ఫార్మా, రక్షణ, తయారీ, ఏరోస్పేస్‌ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణను 2035 నాటికి ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి, తెలంగాణ రైజింగ్‌ దార్శనికతకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఇందుకు అమెరికన్ల మద్దతు కూడా కావాలని సీఎం కోరారు. జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసం, విలువల ఆధారంగా అమెరికా-భారత్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని చెప్పారు. ‘ఒక్కటిగా ఉంటే మరింత బలంగా ఎదగగలమని నేను నమ్ముతా. హైదరాబాద్‌ మరింత పురోభివృద్ధి సాధించాలని, అమెరికా నుంచి తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 08:06 AM