Share News

రూ.50 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం నేడు విదేశీ పర్యటనకు రేవంత్‌

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:32 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌.. గురువారం రాత్రి 10 గంటలకు సింగపూర్‌కు పయనమవుతారు.

రూ.50 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం నేడు విదేశీ పర్యటనకు రేవంత్‌

  • సింగపూర్‌, స్విట్జర్లాండ్‌లో 8 రోజుల టూర్‌

  • దావో్‌సలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు!

  • 24న తిరిగి హైదరాబాద్‌కు సీఎం రాక

హైదరాబాద్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌.. గురువారం రాత్రి 10 గంటలకు సింగపూర్‌కు పయనమవుతారు. ఈ నెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజులపాటు అక్కడ గడపనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఏర్పాటైన క్రీడా విశ్వవిద్యాలయాలు, స్టేడియాలను పరిశీలించి.. అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సీఎం సమావేశమవుతారు. అనంతరం ఈ నెల 20న స్విట్జర్లాండ్‌కు వెళ్లి.. అక్కడ నాలుగు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దావో్‌సలో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. కాగా, గతేడాది తొలిసారి దావో్‌సకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి రూ. 40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు.


ఇందులో అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలున్నాయి. ఈసారి అంతకుమించి పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. విస్తరణలో భాగంగా ఇక్కడే మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఈసారి దావో్‌సలో ఆయా కంపెనీల చైర్మన్లు, సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే.. భారత్‌లో పెట్టుబడులకు సిద్ధమవుతున్న విదేశీ కంపెనీలు తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంగా ఈసారి దావోస్‌ సమావేశంలో ‘తెలంగాణ పెవిలియన్‌’ పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి దావోస్‌ సమావేశాల్లో రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. కాగా, దావోస్‌ పర్యటన అనంతరం ఈ నెల 24న సీఎం హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 03:32 AM