Share News

Future City Project: ఫ్యూచర్‌ సిటీ, నిమ్జ్‌ భూసేకరణ పూర్తి చేయండి

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:35 AM

ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Future City Project: ఫ్యూచర్‌ సిటీ, నిమ్జ్‌ భూసేకరణ పూర్తి చేయండి

  • పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లకూడదు

  • డేటా సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి

  • పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. జహీరాబాద్‌ నిమ్జ్‌కు సంబంధించి మిగిలి ఉన్న భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ వెనక్కి వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు పరిశ్రమల శాఖపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. జహీరాబాద్‌ నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూసేకరణను తక్షణమే పూర్తి చేయాలని, భూములు ఇచ్చేలా రైతులను ఒప్పించాలని ఆదేశించారు. డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్థ పెట్టాలని సూచించారు.


ఫ్యూచర్‌ సిటీలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ క్యాంప్లెక్స్‌ ఏర్పాటుకు అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్‌ ఆర్టిటెక్ట్‌ను నియమించుకోవాలని అన్నారు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌ సహా అన్ని రకాల క్రీడలకు స్పోర్ట్స్‌ క్యాంప్లెక్స్‌లో స్థానం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న మెగా ప్రాజెక్టులపై మంత్రివర్గ ఉపసంఘం 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి చర్చించాలని సీఎం ఆదేశించారు. 2024లో 70 గ్లోబల్‌ కెపబులిటీ సెంటర్‌(జీసీసీ)లు రాష్ట్రానికి వచ్చాయని, ఈ ఏడాదిలో ఇప్పటికే 25 రాగా ఆ సంఖ్య పెంపునకు కృషి చేయాలని కోరారు. రాబోయే 100 రోజులకు ప్రణాళిక సిద్థం చేసుకొని పని చేయాలని పరిశ్రమల అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌ కుమార్‌, సంచాలకులు నిఖిల్‌ చక్రవర్తి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 03:35 AM