Share News

CM Revanth Reddy: ప్రతిసారీ ఫొటోలు దిగి చూపాలా?

ABN , Publish Date - Mar 14 , 2025 | 05:26 AM

గాంధీ కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అందరూ అనుకునేదానికంటే ఎక్కువ సాన్నిహిత్యమే ఉందన్నారు. విపక్షాల ఉచ్చులో తాను పడబోనని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీకి, తనకు మధ్య దూరం పెరిగిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు.

CM Revanth Reddy: ప్రతిసారీ  ఫొటోలు దిగి చూపాలా?

గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది

  • వారిని కలిసినప్పుడల్లా ఫొటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు

  • నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు

  • విపక్షాల ఉచ్చులో పడను.. వాళ్లను పట్టించుకోను

  • రేవంత్‌.. చెబితే చేస్తాడు.. ఎక్కడా రాజీ పడడు

  • కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో తోడుగా ఉన్నోళ్లు మాకు ముఖ్యం

  • 37 మందిని కార్పొరేషన్‌ చైర్మన్లను చేశాం

  • రాష్ట్ర సమస్యలపై కిషన్‌రెడ్డి పోరాడాలి

  • బీఆర్‌ఎస్‌ పైశాచికానందం పొందుతోంది

  • శాసనసభలో చర్చకు కేసీఆర్‌ రావాలి ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌

న్యూఢిల్లీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): గాంధీ కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అందరూ అనుకునేదానికంటే ఎక్కువ సాన్నిహిత్యమే ఉందన్నారు. విపక్షాల ఉచ్చులో తాను పడబోనని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీకి, తనకు మధ్య దూరం పెరిగిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ‘‘ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను పట్టించుకోను. గాంధీ కుటుంబానికి నాపై ఎంతో నమ్మకం ఉంది కాబట్టే పీసీసీ అధ్యక్షుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేశారు. విపక్షాలు మొదటి నుంచి అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నాయి. కానీ, మంత్రివర్గం నుంచి రాజ్యసభ, ఎమ్మెల్సీల వరకు ఏం జరిగిందో చూశారు కదా? అయినా, గాంధీలను కలిసిన ప్రతిసారి ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు. నేను ఎవరి ట్రాప్‌లో పడను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కాబట్టే ఆయన్ని రాష్ట్ర సమస్యలపై అడుగుతున్నామని చెప్పారు. కిషన్‌రెడ్డికి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని, వ్యక్తిగతంగానూ ఆందరితో పరిచయాలు ఉన్నాయని గుర్తుచేశారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రతిఒక్కరూ వాళ్ల రాష్ట్రానికి సంబంధించి సమస్యలు లేవనెత్తుతారని, వాటిని సాధిస్తారని.. నిర్మలా సీతారామన్‌ చెన్నైకి మెట్రో తీసుకెళ్లారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కిషన్‌రెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా, తామిచ్చిన ఆరు గ్యారెంటీల గురించి కేంద్రాన్నేమీ అడగడం లేదని, ప్రధాని మోదీ ప్రకటించిన.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో గురించే అడుగుతున్నామని తెలిపారు. తెలంగాణ సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డికి ఉందన్నారు. హిందీ ఎక్కువ మంది మాట్లాడే భాషేనని, జాతీయ భాష కాదని పునరుద్ఘాటించారు. హిందీ తర్వాత తెలుగే ఎక్కువగా మాట్లాడతారన్నారు. హిందీని దక్షిణాదిపై రుద్దడంలో బీజేపీకి ఏదో రహస్య అజెండా ఉందని ఆరోపించారు.


చెబితే కచ్చితంగా చేస్తా.. రాజీ పడను

తాను చెబితే కచ్చితంగా చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడనని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘‘రేవంత్‌.. చెప్తే చేస్తాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన ప్రతిమాటను నెరవేర్చాను. సీఎం పదవి వచ్చిన తర్వాత ఎంతోమంది వస్తుంటారు. కానీ.. కొట్లాడేటప్పుడు, ఉద్యమాలు చేసేటప్పుడు ఎవరైతే మనతో ఉంటారో, వాళ్లకు అండగా ఉండాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో మనతో ఉన్నోళ్లు ముఖ్యం కదా? సమయాన్ని బట్టి అందరికీ న్యాయం చేస్తానని చెప్పా. అలాగే, చేస్తున్నా. కాంగ్రెస్‌ కోసం పనిచేసిన 37 మందికి ఒకేసారి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చా. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని చూశామా? ఇచ్చిన హామీలో భాగంగానే అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌ నాయక్‌కు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాం. విజయశాంతి ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరింది. శంకర్‌ నాయక్‌ ఎమ్మెల్యే సీటు కావాలని అడిగితే ఇవ్వడం కుదరదని చెప్పా. ఎమ్మెల్సీని చేస్తానని.. అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచెయ్యాలని సూచించా. అన్నట్టుగానే ఎమ్మెల్సీని చేశా. ఇలా.. ఇచ్చిన ప్రతిమాటను నెలబెట్టుకుంటున్నా. ఒక ట్రాక్‌ రికార్డు ఉండాలి కదా? రేవంత్‌ చెబితే చేస్తాడనే నమ్మకం కేడర్‌లోనూ, ప్రజల్లోనూ ఉండాలి. అందుకే కేడర్‌ను బలోపేతం చేస్తూనే, హామీలు అమలు చేస్తున్నా’’ అని రేవంత్‌ తెలిపారు.


అబద్ధాలు చెప్పడం.. మభ్యపెట్టడం చేతకాదు..

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అదే విషయాన్ని ప్రజలకు చెప్పానన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని, దశలవారీగా హామీలు అమలు చేస్తానని చెప్పానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మభ్యపెట్టడం తనకు చేతకాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా, ప్రభుత్వ ఏర్పాటు, యంత్రాంగం తదితర విషయాలన్నింటినీ సరిచేసుకుని.. సీఎంగా పనిచేసింది ఎనిమిది నెలలేనని చెప్పారు. ఈ కొద్ది సమయంలోనే రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్‌ సిలెండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.10 లక్షల ఆరోగ్య సేవలు.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేశానని తెలిపారు. నిరుద్యోగ రేటును గణనీయంగా తగ్గించానని, సొంత పన్నుల రాబడిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపానని గుర్తుచేశారు. ఐదేళ్ల తర్వాత ఎన్నికలకు వెళితే ‘రేవంత్‌ చెబితే చేస్తాడు’.. అనే నమ్మకంతో ప్రజలు ఓటేయాలని, ప్రస్తుతం అదే చేస్తున్నానని వివరించారు.


కేసీఆర్‌ అసెంబ్లీలో చర్చకు రావాలి..

కేసీఆర్‌ గవర్నర్‌ ప్రసంగానికి రావడం కాదని, అసెంబ్లీలో చర్చలకు రావాలని రేవంత్‌రెడ్డి సూచించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని తుప్పు పట్టించారని, ఇప్పుడిప్పుడే ఆ తప్పును వదిలిస్తూ ముందుకెళుతున్నానని చెప్పారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఇలాగే చేశారని తెలిపారు. వారికి గత పాలనలో జరిగిన నష్టాన్ని సరిచేయడానికి రెండేళ్ల సమయం పట్టిందని గుర్తుచేశారు. కేసీఆర్‌ పదేళ్లలో ఒక్క కొత్త పాలసీనీ తీసుకురాలేదని చెప్పారు. కానీ, తాను అతి తక్కువ సమయంలో కులగణనను పూర్తి చేశానన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలోనూ బీజేపీ మిత్రపక్షమే అధికారంలో ఉందని, అక్కడెందుకు కులగణన చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నేతల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోందన్నారు. రైతుల పంటలు ఎండిపోతే, టన్నెల్‌ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే బీఆర్‌ఎస్‌ నేతలు డప్పులు వాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది వారి పైశాచిక ఆనందమని తెలిపారు. మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయిందని, ఆ తర్వాత ఆదిలాబాద్‌, కొత్తగూడెం.. ఇలా అన్నింటికీ మార్గం సుగమం అవుతుందని అన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 05:27 AM