Share News

CM Revanth Reddy Accuses KCR of Secret Deals: కుమ్మక్కయ్యారు

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:32 AM

కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు...

CM Revanth Reddy Accuses KCR of Secret Deals: కుమ్మక్కయ్యారు

  • ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ అరెస్టుకు అనుమతివ్వరేం?

  • కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తే 48 గంటల్లో అరెస్టన్నరు?

  • కేసీఆర్‌, హరీశ్‌లను పోలింగ్‌ లోగా అరెస్టు చేస్తారా?

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌

  • ఎప్పటికైనా బీఆర్‌ఎస్‌ బీజేపీలో విలీనమయ్యేదే

  • మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్‌ఎ్‌సను గెలిపించే కుట్ర

  • బీజేపీ నాయకత్వంపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి

  • పదేళ్లు మునిసిపల్‌ మంత్రిగా ఉన్న చెత్తనాకొడుకు హైదరాబాద్‌లో చెత్త గురించి మాట్లాడుతున్నడు

  • రోజంతా చెత్తకుండీ దగ్గర కట్టేస్తే తెలుస్తుంది

  • ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్‌కు 4 వేల ఇందిరమ్మ ఇళ్లు

  • 30 వేల మెజారిటీతో గెలుస్తాం.. రోడ్డు షోలో రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్‌ బంధం లేకపోతే జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, కేసీఆర్‌, హరీశ్‌లను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో కంపెనీ నుంచి వసూలు చేశారని, ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్‌ వద్ద ఫైల్‌ ఆగిపోయిందని ప్రస్తావించారు. కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు. ‘‘మీ గూడుపుఠాణీ ఏంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్‌ఎ్‌సను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్‌ఎస్‌ బీజేపీలో విలీనమవుతుంది. ఇదీ నేను చెప్పలేదు. కేటీఆర్‌ సొంత చెల్లెలుచెప్పింది. విలీనానికి తాను ఒప్పుకోలేదు కాబట్టే పార్టీలో నుంచి బయటకు వెళ్లగొట్టారని చెబుతోంది. కారు స్టీరింగ్‌ మోదీ చేతిలో ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. మంగళవారం రాత్రి ఆయన జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌తో కలిసి రహమత్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌పీఆర్‌ హిల్స్‌ నుంచి రోడ్డు షో నిర్వహించారు. శ్రీరామ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. ‘‘గతంలో రాష్ట్రంలో పర్యటనకు వచ్చినపుడల్లా మోదీ, అమిత్‌షాలు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎ్‌సకు ఏటీఎంగా మారిందని, లక్షల కోట్లు కొల్లగొట్టారని చెప్పారు. కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలో జరిగిపోయింది. లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయి. దాని మీద వేసిన జ్యూడిషియల్‌ కమిషన్‌ కేసీఆర్‌, హరీశ్‌లు దోషులని, వారిపై చర్యలు తీసుకోవాలని నివేదికిస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సీబీఐకి కేసు అప్పగించాం. సెప్టెంబరు ఒకటిన కేసును కేంద్రం చేతిలో పెట్టాం. అంతకుముందు కిషన్‌రెడ్డి కాళేశ్వరం కేసు మాకివ్వండి, సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీకొడుకులను చంచల్‌గూడ జైలుకు పంపిస్తామన్నారు. సీబీఐకి ఇచ్చిన తర్వాత ఎందుకు అరెస్టు చేయట్లేదు?’’ అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


సాంప్రదాయన్ని తుంగలో తొక్కిందే బీఆర్‌ఎస్‌

ఎవ్వరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సంప్రదాయన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నిక తీసుకొచ్చిందే బీఆర్‌ఎస్‌ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పాలేరులో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, నారాయణ్‌ఖేడ్‌లోకృష్ణారెడ్డి చనిపోయినపుడు వాళ్ల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇస్తే కేసీఆర్‌ వారికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలిపి ఓడించలేదా? తండ్రీ కొడుకులను అడుగుతున్నా? నాడు మీకో నీతి, ఈనాడు మాకో నీతా?’’ అని ప్రశ్నించారు. ‘‘మీ జాతికి నీతి ఉందా? ఉంటే ఆనాడు పీజేఆర్‌ మీద పోటీ పెట్టిన్నందుకు ఎస్పీహిల్స్‌ కాలనీలో ముక్కు నేలకు రాయాలి. ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఓట్లు అడగాలి’’ అన్నారు. పీజేఆర్‌ కుటుంబాన్ని ఏకగీవ్రం చేసేందుకు ఆనాడు చంద్రబాబు ప్రయత్నిస్తే కేసీఆర్‌ పోటీ పెట్టారని చెప్పారు. ఆడబిడ్డను ఆదుకోండి. కన్నీటిని తుడవాలని చెబుతున్న కేటీఆర్‌ తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని ఇంట్లో నుంచి గెంటేశాడన్నారు. నీచుడు, దుర్మార్గుడు, లాలూచీ ఉన్నోడు ఎవ్వడైనా ఉన్నడంటే తనేనన్నారు. ‘‘తెలంగాణను తండ్రి దోచుకున్న ఆస్తిలో చారానా వాటా సొంత చెల్లెలుకు ఇస్తే తిడుతుందా? ఇయనే మహిళా సెంటిమెంట్‌ గురించి మాట్లాడుతున్నారు’’ అని దుయ్యబట్టారు. ‘‘ఇంట్లో ఆడబిడ్డను చూసుకోలేదు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఓర్వలేరు’’ అని వ్యాఖ్యానించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలు గజ్వేల్‌లో ఫామ్‌హౌస్‌ అడిగారా? జన్వాడలో రెండు ఎకరాలు అడిగారా? పేదలకు పదేళ్లలో రేషన్‌కార్డు ఎందుకు ఇవ్వలేదు? సన్నబియ్యం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు రద్దు చేయనికి బీఆర్‌ఎ్‌సను గెలిపించాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.


ఆ చెత్తనా కొడుకే పదేళ్లు మున్సిపల్‌ మంత్రి

కేటీఆర్‌ గల్లీలకు వచ్చి ఇక్కడ చెత్త ఏంది? మట్టి ఏందీ అంటున్నారని, ఆ చెత్తనా కొడుకే పదేళ్లు మున్సిపల్‌ మంత్రిగా ఉన్నారని ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సర్వ దరిద్రాలకు, సర్వ రోగాలకు వాడే కారణం కాదా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను మున్సిపల్‌ చెత్తకుండీదగ్గర ఒక రోజంతా కట్టేస్తే తెలుస్తుందని అన్నారు. ‘‘బలిసి బెంజి కార్లలో తిరిగిండు, కారు షెడ్డుకు పోగానే బిల్లా, రంగాలు ఆటోలో గల్లీలు తిరిగి ఏ ఇల్లు కొల్లగొడదామా? అని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ హైదరాబాద్‌కు ఏం తెచ్చారో చెప్పాలని అడిగారు. ‘‘శిల్పారామం కాంగ్రెస్‌ హయాంలో కట్టిస్తే ఈ సన్నాసి పోయి సెల్పీలు దిగుతుండు. హైటెక్‌ సిటీ మేము కడితే ఇదీ చూడుర్రంటూ బొమ్మలు దిగుతుండు. బొమ్మలు దిగనికి ఉన్నవా? పదేళ్లు మంత్రిగా ఏమీ తేకుండా గాడిద పళ్లు తోమినవా? మేం హైటెక్‌ సిటీ కడితే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేస్తే, మెట్రో రైలు తీసుకొస్తే, అంతర్జాతీయ విమానాశ్రయం కడితే, ఐటీ, ఫార్మా కంపెనీలు తీసుకొస్తే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఏం తెచ్చారు? జన్వాడలో వంద ఎకరాల్లో కేటీఆర్‌, గజ్వేల్‌లో వెయ్యి ఎకరాలో కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ కట్టుకుండ్రు. మెయినాబాద్‌లో 50 ఎకరాల్లో హరీశ్‌రావు ఫామ్‌హౌజ్‌ కట్టుకుండు. కవిత శంకర్‌పల్లి దగ్గర ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారు. ఇవన్నీ అబద్ధమని కేటీఆర్‌ను చెప్పమనండి.. ఎక్కడ్నుంచి వచ్చింది ఈ సొమ్ము? రబ్బరు చెప్పులు లేనోళ్లకు వందల ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌లు ఎవ్వనయ్య జాగీరు? ఏడికెళ్ళి సంపాదించిర్రు?’’ అని ప్రశ్నించారు.

Updated Date - Nov 05 , 2025 | 06:31 AM