Share News

CM Revanth Reddy: ప్రజావాణి అర్జీల తీరును పరిశీలిస్తా

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:27 AM

ప్రజావాణి అర్జీల పరిష్కార తీరును తాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని, అందుకు దాని డ్యాష్‌ బోర్డు లైవ్‌ యాక్సెస్‌ తనకు ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy: ప్రజావాణి అర్జీల తీరును పరిశీలిస్తా

  • డ్యాష్‌ బోర్డు లైవ్‌ యాక్సెస్‌ నాకు ఇవ్వండి

  • జిల్లాల్లో ప్రజావాణి డ్యాష్‌ బోర్డును రాష్ట్ర

  • డ్యాష్‌బోర్డుతో లింకు చేయండి: రేవంత్‌

ప్రజావాణి అర్జీల పరిష్కార తీరును తాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని, అందుకు దాని డ్యాష్‌ బోర్డు లైవ్‌ యాక్సెస్‌ తనకు ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరు, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయటం వేగవంతమవుతుందన్నారు. అలాగే, జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజా భవన్‌లో జరిగే ప్రజావాణి డ్యాష్‌ బోర్డుతో అనుసంధానం చేయాలని చెప్పారు. దీంతో మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలు వెంటనే అక్కడికక్కడే పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజావాణికి ఇప్పటి వరకు వచ్చిన అర్జీలు, వాటి పరిష్కార తీరుపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రజా భవన్లో ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించామని, 54,619 అర్జీలు వచ్చాయని, వాటిలో 68.4 శాతం (37,384) పరిష్కారమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేశామని, గల్ఫ్‌ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటు చేశామని తెలిపారు. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసర అర్జీలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని, అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని పేర్కొన్న సీఎం రేవంత్‌.. అర్జీల పరిష్కారానికి మరింత పారదర్శక, సమర్థ విధానాలు అమలు చేయాలని సూచించారు. అర్జీల వివరాలతోపాటు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు పురోగతిని పారదర్శకంగా అందరూ తెలుసుకునేలా ఈ పోర్టల్‌ను రూపొందించాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్రకారం సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. అధికారుల స్థాయిలో కమిటీ వేసి ఇందుకు మార్గదర్శకాలు రూపొందించాలన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 04:27 AM