Advanced Technology Centers: జీనోమ్ వ్యాలీలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:20 AM
ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులకు శిక్షణ అందించేందుకు జీనోమ్ వ్యాలీలో మోడల్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయో టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం
ఏటీసీల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయండి
గిగ్ వర్కర్లకు సంక్షేమ నిధి, ఆరోగ్య, ప్రమాద ఇన్సూరెన్స్
కొత్త పాలసీ పకడ్బందీగా ఉండాలి: ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులకు శిక్షణ అందించేందుకు జీనోమ్ వ్యాలీలో మోడల్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పని చేయాలని, అందులో ప్రత్యేక కోర్సులను బోధించాలని సూచించారు. అవసరమైన స్థలం కేటాయించడంతోపాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐ కళాశాలల్లో ఏటీసీలు ఏర్పాటు చేయాలని గతంలోనే సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించగా, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మొదటి విడతలో 25, రెండో విడతలో 40, చివరి విడతలో 46 కేంద్రాలను నెలకొల్పనున్నామన్నారు. ఇప్పటిదాకా 49 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ మేరకు స్పందించిన సీఎం.. ఏటీసీల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా అన్ని కేంద్రాల పనులు పూర్తి చేయాలన్నారు. పనుల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. వీలైనంత త్వరగా పూర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. కాగా, ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఉపాఽధి పొందుతున్న గిగ్ వర్కర్ల కోసం సిద్ధమవుతున్న ప్రత్యేక పాలసీపైనా సీఎం సమీక్షించారు. పాలసీ వివరాలను అఽధికారులు వివరించగా.. సీఎం పలు సూచనలు చేశారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిగ్ వర్కర్లకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించేలా పకడ్బందీగా కొత్త విధానం ఉండాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News