Share News

Bhatti Vikramarka: సబ్‌ ప్లాన్‌ నిధులు సకాలంలో వాడాలి

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:09 AM

ప్రతీ శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్ట నియమ నిబంధనల ప్రకారం నిధులను సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

Bhatti Vikramarka: సబ్‌ ప్లాన్‌ నిధులు సకాలంలో వాడాలి

  • వ్యయాలను నెలకోసారి వెల్లడించాలి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రతీ శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్ట నియమ నిబంధనల ప్రకారం నిధులను సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం అమలు తీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన వ్యయ వివరాలను ప్రతి నెల రోజులకు ఒకసారి వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. శాఖలవారీగా కేటాయించిన సబ్‌ ప్లాన్‌ నిధులను సంతృప్త స్థాయిలో వినియోగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆదాయం బాగా పెరిగేలా ప్రణాళికలను రూపొందించాలని, వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 23న నిర్వహించబోయే సమావేశానికి రావాలని ఆయన చెప్పారు.


మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను గుర్తించి, స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించాలని, వారికి వడ్డీ లేని రుణాలను అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇందిర జలప్రభ పథకం కింద ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి, ఎస్సీ, ఎస్టీ రైతులకు చేయూతనివ్వాలన్నారు. అటవీ భూముల్లో సౌర విద్యుత్తు ద్వారా మోటార్లను వినియోగించి, వెదురు, అవకాడో, పామాయిల్‌, అంతర పంటల సాగుకు ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 04:09 AM