Share News

OECD : ఓఈసీడీ సదస్సుకు కేంద్రం అనుమతి వద్దా?

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:43 AM

హైదరాబాద్‌లోని స్టార్‌ హోటల్‌లో జూన్‌లో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓఈసీడీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ వార్షిక సదస్సుపై కేంద్ర వ్యవసాయశాఖ అసంతృప్తి వ్యక్తంచేసింది.

OECD : ఓఈసీడీ సదస్సుకు కేంద్రం అనుమతి వద్దా?

  • అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి కేంద్ర సర్కారు లేఖ

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని స్టార్‌ హోటల్‌లో జూన్‌లో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓఈసీడీ(ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌)వార్షిక సదస్సుపై కేంద్ర వ్యవసాయశాఖ అసంతృప్తి వ్యక్తంచేసింది. పథకాల పర్యవేక్షణ చేసే నియమిత జాతీయ సంస్థ(నేషనల్‌ డిసిగ్నేటెడ్‌ అథారిటీ- ఎన్‌డీఏ), కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖను ఓఈసీడీ సంప్రదించకపోవటంపై అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ రాజేశ్‌ సింగ్‌ ఈనెల 2న రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌తోపాటు వ్యవసాయశాఖ కార్యదర్శికి లేఖ రాశారరు. అంతర్జాతీయ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నపుడు కేంద్రం అనుమతి ఎందుకు తీసుకోలేదు? విదేశీ ప్రతినిధులను ఆహ్వానించినపుడు విదేశాంగ శాఖ అంగీకారం ఎందుకు తీసుకోలేదు? కేంద్ర వ్యవసాయశాఖను ఎందుకు సంప్రదించలేదు? అని ప్రశ్నించారు.


ఈ సదస్సుకు ఆమోదం తెలిపిన అధికారుల వివరాలు, కేంద్రాన్ని సంప్రదించకపోవటానికి గల కారణాలు? సమావేశం ఫలితాలు, కీలక చర్చలపై నివేదిక పంపించాలని కోరారు. ఓఈసీడీ అనేది ప్రైవేటు సంస్థ. దేశంలో ఎక్కడైనా ఈ సదస్సు నిర్వహించాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలి. అయితే రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ ప్రతిపాదన మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి ఓఈసీడీకి నేరుగా లేఖ రాశారు. హైదరాబాద్‌లోని స్టార్‌ హోటల్‌లో జూన్‌ 8 నుంచి 13 వరకు సదస్సు నిర్వహించారు. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులెవరూ ఈ సదస్సుకు హాజరుకాలేదు. ప్రైవేటు సంస్థ వార్షిక సదస్సుకు సుమారు రూ.40లక్షల రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టినట్లు సమాచారం. సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగినట్లు తెలిసింది. ఒకవైపు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే.. నూజివీడు, కావేరి, హైటెక్‌, రాశిసీడ్స్‌ లాంటి పెద్ద విత్తన కంపెనీల ప్రతినిధులను భాగస్వాములను చేసి ఈ సదస్సు ఎందుకు నిర్వహించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

Updated Date - Jul 06 , 2025 | 04:43 AM