Share News

Handloom Industry: దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం కీలకం

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:44 AM

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత, వస్త్ర పరిశ్రమ కీలకమైన భాగమని, దీని ద్వారా దాదాపు 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Handloom Industry: దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం కీలకం

  • అంతర్జాతీయ చేనేత హబ్‌గా రాష్ట్రం

  • చేనేతలో సంస్కరణలకు కేంద్రం సిద్ధం

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత, వస్త్ర పరిశ్రమ కీలకమైన భాగమని, దీని ద్వారా దాదాపు 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శిల్పారామంలో జరిగిన చేనేత వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మేకిన్‌ ఇండియా కార్యక్రమం ద్వారా చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతో ఏటేటా అభివృద్ధి చెందుతూ.. ప్రస్తుతం దేశ జీడీపీలో 2.3 శాతంగా ఉందని తెలిపారు. 2023-24లో ఈ రంగం ద్వారా రూ. 3 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని, దీన్ని 2030 నాటికి రూ.9 లక్షల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. అందుకే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్‌ఐ),నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్‌ (ఎన్‌హెచ్‌డీపీ) ద్వారా నేతన్నలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని, వారికి అంతర్జాతీయ మార్కెటింగ్‌ సదుపాయాలతో పాటు మౌలిక వసతుల కల్పిస్తోందని చెప్పారు.


అలాగే రాయితీలతో కూడిన రుణాలు, జాతీయ, రాష్ట్రీయ పురస్కారాలు పొందిన నేతన్నలకు రూ.8 వేల నెలవారీ పెన్షన్‌ కూడా ఇస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రానికి చెందిన 20 మంది చేనేత కార్మికులు.. తమ ప్రతిభను ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాల్లో జరిగిన ఎక్స్‌పోలో ప్రదర్శించారని చెప్పారు. అంతర్జాతీయ చేనేత హబ్‌గా రూపుదిద్దుకుంటోందన్నారు. పోచంపల్లి, ఇక్కత్‌, గద్వాల్‌, నారాయణపేట కాటన్‌ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీర, తేలియా రుమాల్‌, వరంగల్‌ తివాచీ వంటి చేనేత ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్‌) లభించిందని తెలిపారు. చేనేత రంగంలో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, సమగ్రమైన ప్రణాళిక తో వస్తే కేంద్రంతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నాననిచెప్పారు. దేశ వ్యాప్తంగా ఏడు పీఎం మిత్ర టెక్స్‌టైల్‌ పార్క్‌లు ఖరారు చేస్తే.. అందులో ఒకటి రాష్ట్రానికి కేటాయించారన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 04:44 AM