Uttam: రాయలసీమ ఎత్తిపోతలకు.. పర్యావరణ అనుమతి నిరాకరణ
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:31 AM
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) అనుమతిని నిరాకరించింది.

మళ్లీ విధి విఽధానాల జారీకి కేంద్రం నిర్ణయం
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) అనుమతిని నిరాకరించింది. గతనెల 27న వివిధ ప్రాజెక్టుల అనుమతి కోసం జరిగిన ఈఏసీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు మళ్లీ అనుమతి కోసం విధివిధానాల (టర్మ్ అండ్ రిఫరెన్స్)ను జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణ అనుమతి ఇవ్వరాదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖలు రాశారు. నేరుగా కలిసి, ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీంతో.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతిని నిరాకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను అక్రమంగా తరలించడానికి చేపట్టిన ఈ పథకానికి పర్యావరణ అనుమతి నిరాకరించడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయమంటూ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా జలాలపై ఏ ప్రాజెక్టును నిర్మించాలన్నా.. కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) డీపీఆర్‌ను పరిశీలించాల్సి ఉంటుంది.
కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) క్లియరెన్స్, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ(టీఏసీ) సాంకేతిక అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. నీటి కేటాయింపులు లేకుండా ఏ విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడతారు?’’ అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాలపై విచారణ కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అప్పటి నుంచి తెలంగాణ నీటి వాటాను కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతలకు వ్యతిరేకంగా ఎన్‌జీటీలోనూ పోరాటం చేస్తున్నామని, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించడానికి ట్రెబ్యునల్‌లో బలమైన వాదనలను వినిపిస్తున్నామని వివరించారు. తెలంగాణ వాదనతో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం రాష్ట్రాలవారీగా నీటి కేటాయింపులపై వాదనలు వినాలని ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుందని, ఇది కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు. ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిశాం. వాస్తవాలను వివరించాం. ఎన్‌జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి, రాయలసీమ ఎత్తిపోతలను ఏపీ నిర్మిస్తోందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం వల్లే.. పర్యావరణ అనుమతి ఆగిపోయుంది. రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోకపోతే తెలంగాణలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తేవి’’ అని వ్యాఖ్యానించారు.