Share News

Medical Education: వైద్య విద్యలో కీలక సంస్కరణలు 220 పడకలుంటే బోధనాస్పత్రి

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:58 AM

దేశంలో వైద్య విద్యలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స్పెషలిస్టు వైద్యుల సంఖ్యను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది.

Medical Education: వైద్య విద్యలో కీలక సంస్కరణలు 220 పడకలుంటే బోధనాస్పత్రి

  • అక్కడే కొత్తగా పీజీ సీట్ల మంజూరు

  • స్పెషలిస్టుకు పదేళ్ల అనుభవం ఉంటే..

  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పరిగణన

  • రెండేళ్ల అనుభవానికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

  • కొత్త మెడికల్‌ కాలేజీల్లోనూ నేరుగా పీజీ

  • వైద్య విద్యాసంస్థల నియంత్రణ-2025 నిబంధనల విడుదల

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో వైద్య విద్యలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స్పెషలిస్టు వైద్యుల సంఖ్యను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో 220 పడకులుండే ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా పరిగణించాలని సూచించింది. ఈ మేరకు జాతీయ వైద్య విద్యాసంస్థల(అధ్యాపకుల అర్హత) నియంత్రణ-2025ని నోటిఫై చేసింది. 220 పడకలున్న ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అప్‌గ్రేడ్‌ చేస్తే.. కొత్తగా పీజీ సీట్లు పెరుగుతాయి. ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే సీనియర్‌ స్పెషలిస్టు వైద్యులను బోధనాస్పత్రుల్లో అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పరిగణిస్తారు. అక్కడి పీజీ విద్యార్థులకు వీరు పాఠాలను బోధిస్తారు. దేశంలో వైద్య విద్య అధ్యాపకులు, స్పెషలిస్టు డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) పరిధిలో పనిచేసే పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు(పీజీఎంఈబీ) కొత్త నియంత్రణలను తీసుకువచ్చింది. ఎన్‌ఎంసీ ఆ వివరాలను శనివారం విడుదల చేసింది.


కీలక సంస్కరణలు ఇవే..

  • 220 పడకలను మించిన బోధనేతర ఆస్పత్రులను ఇకపై బోధనాస్పత్రులుగా పరిగణిస్తారు. అక్కడ పనిచేసే సీనియర్‌ వైద్యులకు ఫ్యాకల్టీగా అవకాశమిస్తారు. పదేళ్లుగా స్పెషాలిటీ సేవలు అందించే వైద్యుడికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా.. రెండేళ్ల అనుభవం ఉన్న స్పెషలిస్టుకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమిస్తారు. వారు సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు కాకపోయినా.. ఈ నియామకాలను జరపవచ్చు. ఇలా అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రుల్లో పీజీ సీట్లకు అనుమతినిస్తారు.

  • నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సె్‌స గుర్తించిన ప్రభుత్వ వైద్య సంస్థల్లో సీనియర్‌ కన్సల్టెంట్స్‌గా మూడేళ్ల పాటు పనిచేసి ఉంటే.. వారిని ప్రొఫెసర్‌ పోస్టుకు అర్హులుగా పరిగణిస్తారు. ఎన్‌బీఎఈఎంఎ్‌స గుర్తించిన ప్రభుత్వ వైద్య సంస్థల్లో డిప్లొమా కలిగిన స్పెషలిస్టు లేదా, ఏదైనా ప్రత్యేక విభాగంలో మెడికల్‌ ఆఫీసర్‌గా కనీసం ఆరేళ్ల పాటు పనిచేసిన వారు కూడా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు అర్హులు.

  • సర్కారీ వైద్య పరిశోధన సంస్థలు, వైద్యవిద్య విభాగం, రాష్ట్ర వైద్యమండలి, హెల్త్‌ యూనివర్సిటీ, జాతీయ వైద్య కమిషన్‌లలో ఫ్యాకల్టీ సభ్యుడిగా కనీసం ఐదేళ్లపాటు పనిచేసిన వారికి అనుభవం ఉన్నట్లుగా పరిగణిస్తారు. వీరంతా 220 పడకలుండే ఆస్పత్రుల్లోనే బోధనకు అర్హులు.

  • కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో.. పీజీతోపాటు, ఎంబీబీఎస్‌ కోర్సులను ప్రారంభించుకోవచ్చు. దీనికి ఎన్‌ఎంసీ అనుమతులిస్తుంది. అందుకు అనుగుణంగా టీచింగ్‌ ఫ్యాకల్టీ, హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ను పెంచుకోవాల్సి ఉంటుంది.

  • పీజీ కోర్సులను ప్రారంభించుకోవాలంటే గతంలో ముగ్గురు ఫ్యాకల్టీతోపాటు ఒక సీనియర్‌ రెసిడెంట్‌ అవసరం. ఒక్కో యూనిట్‌కు కనీసం 40 పడకలుండాలి. అప్పుడే ఆ యూనిట్‌కు ఐదు పీజీ సీట్లకు అనుమతులిస్తారు. ప్రస్తుతం ఈ నిబంధనకు కూడా మినహాయింపునిచ్చారు. ఇక నుంచి పీజీ కోర్సులను కేవలం ఇద్దరు ఫ్యాకల్టీలో రెండేసి సీట్లతో ప్రారంభించుకోవచ్చు.

  • ఎంఎస్సీ పీహెచ్‌డీ చేస్తే మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ విభాగాల్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టీగా నియమించుకోవచ్చు.

  • సీనియర్‌గా నియామకానికి గరిష్ఠ వయోపరిమితికి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ వంటి ఫ్రీ క్లినికల్‌, పారా క్లినికల్‌ సబ్జెక్టుల్లో రెసిడెంట్‌ డాక్టర్‌లకు 50 సంవత్సరాలకు పెంచారు. గతంలో గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లుగా ఉండేది. గరిష్ట వయో పరిమితి ఉండేది.

  • పీజీ చేసిట్యూటర్లు, డెమాన్‌స్ట్రేటర్స్‌గా అనుభవం ఉంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అర్హత లభిస్తుంది.

  • ప్రస్తుతం సూపర్‌ స్పెషాలిటీ అర్హతలు ఉండి.. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారిని అధ్యాపకులుగా నియమించవచ్చు.


అధ్యాపకుల పదోన్నతులు ఇలా

ప్రస్తుతం వైద్యవిద్యలో దేశవ్యాప్తంగా అధ్యాపకుల కొరత ఉంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను నేరుగా రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తారు. నాలుగేళ్ల పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తే.. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అసోసియేట్‌గా మూడేళ్ల పాటు సేవలందిస్తే ప్రొఫెసర్‌ అవుతారు. ప్రొఫెసర్‌గా ఐదేళ్లపాటు పనిచేస్తే.. వైద్యవిద్య అదనపు సంచాలకులు అవుతారు. అంటే కనీసం ఏడేళ్ల పాటు వైద్యవిద్యలో అనుభవం ఉంటేనే ప్రొఫెసర్‌ అవుతారు. ఇందులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టును మాత్రమే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయవచ్చు. ఈ నేపథ్యంలో సూపర్‌ స్పెషాలిటీ అనుభవాన్ని నేరుగా అసోసియేట్‌ ప్రొఫెసర్లను నియమించుకునే వెసులుబాటును తాజా సంస్కరణలు కల్పిస్తున్నాయి.

Updated Date - Jul 06 , 2025 | 04:58 AM