Infrastructure Development: 311 కి.మీ.. రూ.4,872 కోట్ల పనులు
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:52 AM
రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి, ఉన్నతీకరణకు సంబంధించి కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో 1,123 కిలోమీటర్ల మేర 15 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ.33వేల కోట్ల మేర పనులు చేయాల్సి ఉందని గుర్తించిన విషయం తెలిసిందే.
4 చోట్ల బ్రిడ్జిలు..3 చోట్ల బైపాస్‌లు.. పలు చోట్ల విస్తరణ
28 పనులు హై కేటగిరి.. మీడియం కేటగిరీలో 2
2025-26 తెలంగాణ వార్షిక ప్రణాళిక ఖరారు చేసిన కేంద్ర రోడ్డు, రవాణాశాఖ
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి, ఉన్నతీకరణకు సంబంధించి కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో 1,123 కిలోమీటర్ల మేర 15 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ.33వేల కోట్ల మేర పనులు చేయాల్సి ఉందని గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా 2025-26 యాన్యువల్ ప్లాన్ కింద మరికొన్ని పనులు చేయాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ గుర్తించింది. ఆ వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4 చోట్ల బ్రిడ్జిలు, 3 ప్రాంతాల్లో బైపాస్‌లు, పలుచోట్ల రోడ్ల విస్తరణ చేపట్టాల్సి ఉందని, మొత్తం 311 కి.మీల మేర పనులు చేయాల్సి ఉందని తేల్చింది. వీటిని 30 పనులుగా విభజించింది. వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.4,872 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. గుర్తించిన 30 పనుల్లో 28 పనులను హై కేటగిరీ కింద త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించింది. మరో రెండింటిని మీడియం కేటగిరిలో చేర్చింది. గుర్తించిన అన్ని పనులకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), అంచనా వివరాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 6 చోట్ల చేపట్టాల్సిన పనులకు డీపీఆర్‌లు శాఖకు అందాయి. మరో 16 పనులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేస్తున్నారు. మిగిలిన పనులకు సంబంధించిన అంచనాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే గుర్తించిన 15 జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ఇవి అదనం. దీని ప్రకారం 15 జాతీయ రహదారుల పనులకు రూ.33,690 కోట్లతో పాటు తాజాగా గుర్తించిన పనులకు రూ.4,872 కోట్లు కలిపి మొత్తం రూ.38,562 కోట్లను రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృదిఽ్ధ కోసం వెచ్చించనున్నారు. ఈ మొత్తం పనులను లక్ష్యం మేరకు పూర్తిచేయాలని నిర్ణయించారు.
గుర్తించిన వాటిలో ముఖ్యమైన పనుల వివరాలు..
ఎన్‌హెచ్ 161బీ మద్నూర్-బోధన్ సెక్షన్‌లో 39 కి.మీ మేర రోడ్డు విస్తరణ. డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. రూ.634కోట్ల అంచనా.
ఎన్‌హెచ్- 365బీ దుద్దెడ నుంచి సిరిసిల్ల సెక్షన్‌లో 54 కి.మీల మేర 4లేన్ల పేవ్డ్ షోల్డర్ విధానం. రూ.1,150 కోట్లు అంచనా.
ఎన్‌హెచ్- 61 మార్గంలో ఖానాపూర్ నుంచి చెల్గల వరకు 54 కి.మీల ఉన్న బైపాస్ విస్తరణ, అభివృద్ధి. రూ.750 కోట్లు అవసరమని అంచనా.
ఎన్‌హెచ్-167ఎన్‌లో రూ.550కోట్లతో 11 కి.మీల బైపాస్ నిర్మాణం.
22కి.మీ మేర భూపాలపల్లిలో బైపాస్ నిర్మాణం. 500 కోట్ల అంచనా.
ఎన్‌హెచ్-163 మార్గంలో హైదరాబాద్ నుంచి భూపాలపట్నం సెక్షన్‌లో 35 కి.మీ మేర 4 లేన్ల విస్తరణ. రూ.270కోట్ల అంచనా. ఎన్‌హెచ్- 353సీ సెక్షన్‌లో రూ.190 కోట్లతో34 కి.మీల పరకాల బైపాస్ నిర్మాణం.
ఎన్‌హెచ్-167లో హుజూర్‌నగర్ దగ్గర 180కోట్లతో 7కి.మీ మేర బైపాస్.
ఎన్‌హెచ్-163లోని హైదరాబాద్- భూపాలపట్నం సెక్షన్‌లో కిలోమీటర్ మేర 2 బ్రిడ్జిల నిర్మాణం. రూ.150 కోట్ల అంచనా.
ఎన్‌హెచ్-63 మార్గంలోని నిజామాబాద్-జగదల్‌పూర్ సెక్షన్‌లో మేజర్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ, ఇప్పటికే ఉన్న ఒక మేజర్ బ్రిడ్జికి అదనపు పనులు కలిపి 10 కి.మీ మేర రూ.151కోట్లు అంచనా.
ఎన్‌హెచ్ 365లో నకిరేకల్ - తానంచర్ల సెక్షన్‌లో 2 కి.మీ పరిధిలో ఒక ఫ్లై ఓవర్, ఒక అండర్‌పాస్ నిర్మాణం. రూ.58 కోట్ల అంచనా.
ఇవి కూడా చదవండి...
గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి