IAS Officer: ఐఏఎస్ శివశంకర్‌ను ఏపీకి పంపలేదేం?
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:03 AM
ఐఏఎస్ లోతేటి శివశంకర్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ)ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) ప్రశ్నించింది.

కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో డీవోపీటీకి క్యాట్ నోటీసులు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ లోతేటి శివశంకర్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ)ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) ప్రశ్నించింది. ఫిబ్రవరి 28న ఇచ్చిన ఆదేశాలను ఇప్పటివరకు అమలు చేయలేదని.. మరో నాలుగువారాలు గడువు ఇస్తున్నామని.. ఆ లోగా తమ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని డీవోపీటీ కార్యదర్శికి స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ కేసులో వివరణ ఇవ్వాలని డీవోపీటీకి నోటీసులు జారీచేసింది. స్థానికత ఆధారంగా ఐఏఎస్ లోతేటి శివశంకర్‌ను ఏపీకి కేటాయించాలని ఫిబ్రవరి 28న క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో లోతేటి శివశంకర్ క్యాట్‌లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది.
రొనాల్డ్ రోస్‌కు క్యాట్‌లో ఊరట
సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రోస్‌కు క్యాట్‌లో ఊరట లభించింది. ఆయనను తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగించాలని పేర్కొంటూ డీవోపీటీకి క్యాట్ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆయనను ఏపీకి కేటాయించగా తెలంగాణలో కొనసాగారు. ఆయన విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి వెళ్లిపోవాలని చెప్పడంతో ఏపీలో రిపోర్ట్ చేశారు. అనంతరం మళ్లీ క్యాట్‌ను ఆశ్రయించారు.