CM Revanth Reddy: కులగణన డేటాతో సంక్షేమం
ABN , Publish Date - Jul 20 , 2025 | 02:15 AM
కులగణన వివరాలను అధ్యయనం చేసి స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అర్హులైన
అర్హులైన వారందరికీ పథకాలు ఇచ్చేందుకు వాడతాం
ఈ డేటా సామాజికంగా తెలంగాణ ఆరోగ్య పరిస్థితిని తెలియజెప్పే మెగా హెల్త్ రిపోర్టు
కులగణన అధ్యయన నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ
క్యాబినెట్‌లో చర్చించి ఈ నెలాఖరులో విడుదల.. ఆయా రంగాల్లో ప్రాతినిధ్యంపై మంత్రులకు ప్రజెంటేషన్
నివేదికలో 242 కులాల వెనుకబాటుతనంపై ర్యాంకింగ్!
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కులగణన వివరాలను అధ్యయనం చేసి స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇది కేవలం గణాంక సమాచారం కాదని, సామాజికంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని తెలియజెప్పే మెగా హెల్త్ చెకప్ నివేదిక అని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ నివేదిక ఉపయోగపడుతుందన్నారు. ఆయా వర్గాల స్థితిగతుల విషయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు కారణాలను కూడా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఆయన నిపుణుల కమిటీని కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కులగణన గణాంకాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ శనివారం 300 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శనరెడ్డి, సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణ కులగణన సర్వే చరిత్రాత్మకమని, ఇది దేశానికి మార్గదర్శి అవుతుందని కమిటీ కమిటీ అభిప్రాయపడింది. సర్వే శాస్త్రీయంగా, విశ్వసనీయంగా ఉందని పేర్కొంది. తమ అధ్యయన నివేదికలోని అంశాలను కమిటీ సీఎంకు వివరించింది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశంపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కమిటీ నివేదికను ఈ నెల 25 లేదా 26 తేదీల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ప్రజల కోసం విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఏడాది వ్యవధిలో కార్యక్రమాన్ని పూర్తి చేసింది. వివరాలను అసెంబ్లీలో ఆమోదించిన తరువాత అందులోని గణాంకాల అధ్యయనం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్య్ర నిపుణుల కమిటీని వేసింది. పలు దఫాలుగా సమావేశమైన కమిటీ సమాచార సేకరణ పద్ధతి సరిగానే ఉందని అభిప్రాయపడింది. ఈ గణాంకాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగు పరుచుకొనేందుకు, బలహీన వర్గాల వర్గాల అభ్యున్నతికి మరింత మెరుగైన చర్యలు తీసుకొనేందుకు ఉపయోగించుకో వచ్చని సూచించింది. వెనుకబాటుతనంలో కులాలకు ర్యాంకింగ్ ఇచ్చినట్లు జూలై 2 నాటి సమావేశంలో కమిటీ తెలిపింది.
మొత్తం 242 కులాల వెనుకబాటుతనానికి సంబంధించి సమగ్ర వెనుకబాటుతనం సూచికను రూపొందించామని చెప్పింది. శనివారం కమిటీ నివేదికను అందజేసిన సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ, ఎస్టీ శాఖల ముఖ్య కార్యదర్శులు శ్రీధర్, ఎ.శరత్ ఉన్నారు. నిపుణుల కమిటీలో కంచె ఐలయ్య, శాంతా సినా?, హిమాన్షు, సుఖ్‌దేవ్ థొరాట్, నిఖిల్ డే, భాంగ్య భూక్య, పురుషోత్తంరెడ్డి, జీన్ డ్రెజ్, థామస్ పికెట్టి, ప్రవీణ్ చక్రవర్తి, ఐఏయస్ అనుదీప్ దురిశెట్టి ఉన్నారు.
కులగణన ఎలా జరిగిందంటే...
సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వేను నిర్వహించింది. 2024 నవంబరు 6 నుంచి డిసెంబరు 25 వరకు మొత్తం 50 రోజుల పాటు సర్వే సాగింది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు కొన్ని వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవటంతో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండో విడతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. మీసేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ, ఎంపీడీవో ఆఫీసులు, వెబ్సైట్ ద్వారా కూడా వివరాల నమోదుకు అవకాశం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లతో శాస్ర్తీయంగా సర్వే చేయించారు. 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా ఎంచుకుని, ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యూమరేటర్‌ను, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించి, ప్రక్రియను పూర్తి చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10%) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 (17.42%) మంది, ఎస్టీలు 37,08,408 (10.43%) మంది, బీసీలు 2,00,37,668 (56.36%) మంది, ఇతర కులాల వారు 56,13,389 (15.89%) మంది ఉన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.