Share News

Sitarama Project: సీతారామపై మంత్రుల సంవాదం!

ABN , Publish Date - Mar 07 , 2025 | 03:47 AM

సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మ సాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంచనాలను పెంచే అంశంపై క్యాబినెట్‌ సమావేశంలో ఇద్దరు కీలక మంత్రుల మధ్య వాడివేడిగా సంవాదం జరిగినట్లు తెలిసింది.

Sitarama Project: సీతారామపై మంత్రుల సంవాదం!

  • అంచనాల పెంపుపై వాడివేడి చర్చ

  • పథకం పాత పేర్లను ప్రస్తావించిన కీలక మంత్రి

  • కొర్రీలు వేసుకుంటూపోతే ఫలితం

  • ఉండదని మరో మంత్రి ఆగ్రహం

  • అంచనాలను పరిశీలించే బాధ్యత

  • రామకృష్ణారావుకు అప్పగింత

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మ సాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంచనాలను పెంచే అంశంపై క్యాబినెట్‌ సమావేశంలో ఇద్దరు కీలక మంత్రుల మధ్య వాడివేడిగా సంవాదం జరిగినట్లు తెలిసింది. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న రూ.7,926 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. తర్వాత పథకంలో పలు మార్పులు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకంలోనే సీతమ్మ బ్యారేజీని కూడా చేర్చారు. దాంతో, 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించారు. తాజాగా వీటిని రూ.13,057 కోట్ల నుంచి రూ.19,324.92 కోట్లకు సవరించాల్సి ఉంది. ఇందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు.. ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్‌సాగర్‌/ఇందిరాసాగర్‌ ప్రాజెక్టును ప్రతిపాదించారని, ఆ స్థానంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టారంటూ కీలక మంత్రి ఒకరు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. దీంతో, మరో కీలక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 4,15,621ఎకరాలకు సాగునీటిని, మరో 3,89,366 ఎకరాలను స్థిరీకరించడానికి చేపట్టిన పథకానికి ఇప్పటి వరకూ రూ.10వేల కోట్లదాకా ఖర్చు చేసిన తర్వాత మళ్లీ పాత పథకాలను లేవనెత్తడం ఎందుకని ప్రశ్నించారు.


సాంకేతిక సలహా మండలి అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, పాత వివాదాన్ని లేవనెత్తి.. సమస్యను జఠిలం చేసుకుంటూ పోతే ప్రాజెక్టు ఏ విధంగా ముందుకెళుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొర్రీలు వేసుకుంటూపోతే ఫలితం ఉండదని, ప్రాజెక్టుపై స్పష్టత ఉండాలని, చేపట్టకూడదనుకుంటే పక్కనపెట్టేయడం లేదా రద్దు చేసుకోవాలని సదరు మంత్రి స్పష్టం చేశారు. దీంతో, ప్రాజెక్టు అంచనాలను కాంపోనెంట్‌ వారీగా వారం రోజుల్లో పరిశీలించే బాధ్యతను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి దీనిపై స్పష్టత వస్తే.. తదుపరి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్‌, ఏదుల రిజర్వాయర్ల మధ్య 8.325 కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌ నిర్మాణ అంచనాను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీన్ని రూ.416.10 కోట్లతో చేపట్టగా.. అంచనాలను సవరించకపోతే పనులు చేసేది లేదని నిర్మాణ సంస్థ రెండేళ్లుగా పక్కనపెట్టింది. దీని అంచనాను రూ.416.81కోట్ల నుంచి రూ.780.63కోట్లకు సవరించడానికి క్యాబినెట్లో ఆమోదం తెలిపారు. అలాగే, ఆర్‌.ఎ్‌స.ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌లోని ప్రధాన కాలువ 12.650 కిలోమీటర్ల నుంచి 31.20 కిలోమీటర్ల దాకా రూ.148.76 కోట్లతో సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ పనుల ర్యాటిఫికేషన్‌కు;రొల్లవాగు చెరువు సామర్థ్యం పెంపునకు సంబంధించి రూ.153కోట్లతో సవరణ అంచనాలకూ ఓకే చెప్పింది. ఇక, గంధమల్ల రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గించే పనులకు రూ.574.56 కోట్లతో క్యాబినెట్‌ ఆమోదించింది. వాస్తవానికి ఈ రిజర్వాయర్‌ను 9.8 టీఎంసీలతో చేపట్టగా.. స్థానికుల ఆందోళనలతో తొలుత 4.8 టీఎంసీలకు, తాజాగా 1.41 టీఎంసీలకు సామర్థ్యాన్ని తగ్గించారు.

Updated Date - Mar 07 , 2025 | 03:47 AM