Bhatti Vikramarka: వికటాట్టహాసం చేస్తున్న దయ్యాలను తరిమి కొట్టండి
ABN , Publish Date - Jun 17 , 2025 | 03:43 AM
ప్రజలకవసరమైన సహాయ సహకారాలందిస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు తమ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి పరోక్ష విసుర్లు
హైదరాబాద్, జూన్ 16, (ఆంధ్రజ్యోతి): ప్రజలకవసరమైన సహాయ సహకారాలందిస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు తమ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అలా నిప్పులు పోసుకుంటున్న నేతలే దయ్యాలని బీఆర్‌ఎస్ నేతలే చెప్పారన్నారు. ఆ దయ్యాలే వికటాట్టహాసం చేస్తున్నాయన్న భట్టి .. ఊర్లో దయ్యాలుంటే అరిష్టమని, ఆ దయ్యాలను ఊరి పొలిమేరల్లోకి రాకుండా తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. పుట్టగతులుండవని పదేళ్లు పాలించిన వారు ప్రజా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలను చీల్చి చెండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి బీఆర్‌ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. రాష్ట్రాన్ని వినాశనం చేసిన వారికి రేవంత్ సర్కారును విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు.