BJP: అవినీతి సొమ్ము పంచుకోవడంలో విభేదాలతోనే కవిత సస్పెన్షన్
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:05 AM
కాళేశ్వరంలోని అవినీతి సొమ్మును పంచుకోవడంలో వచ్చిన విభేదాలతోనే కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
అవినీతిపరులను బీజేపీలో చేర్చుకునేదే లేదు: రాంచందర్‌రావు
కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం: బండి సంజయ్
కరీంనగర్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాళేశ్వరంలోని అవినీతి సొమ్మును పంచుకోవడంలో వచ్చిన విభేదాలతోనే కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. అవినీతిపరులను బీజేపీలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబసభ్యులే బయటపెడుతున్నారని చెప్పారు. కాళేశ్వరంపై ఏమీ తేల్చకుండా 20నెలలు తాత్సారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎ్‌సకు తప్పించుకునే అవకాశం కల్పించిందని రాంచందర్‌రావు అన్నారు. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్నదమ్ముల్లాంటివని విమర్శించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల వాయిదా కోసం హైకోర్టులో పిటిషన్ వేసిందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్, హైకోర్టులో బలమైన వాదనలు వినిపించకుండా బీఆర్‌ఎ్‌సకు సహకరిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ స్కాంలను నిరూపించడంలో కాంగ్రెస్ లీగల్ టీం పూర్తిగా విఫలమైందన్నారు. కాళేశ్వరంతో పాటు ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసు, గొర్రెల పంపిణీలో స్కాం కేసులను కూడా సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలన్నారు. ఇటీవలి వరదల్లో కామారెడ్డితో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ కూడా కొట్టుకుపోయిందని సంజయ్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచే బీజేపీ అభ్యర్థుల్లో.. ఎంపీటీసీలకు రూ.5 లక్షలు, జడ్పీటీసీలకు రూ.10 లక్షల చొప్పున అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు అందించామని, స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే వచ్చే ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లు అందిస్తామన్నారు.