Share News

Kaleshwaram Project: ఈటలకు నోటీసులా?

ABN , Publish Date - Jan 21 , 2025 | 04:22 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు లక్ష్యమేంటి?

Kaleshwaram Project: ఈటలకు నోటీసులా?

  • ఘోష్‌ కమిషన్‌ లక్ష్యమేంటి?

  • బీజేపీ అధిష్ఠానం ఆరా

  • తక్షణ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నేతలకు ఆదేశం

  • అత్యవసర నివేదిక పంపిన రాష్ట్ర నాయకత్వం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు లక్ష్యమేంటి? ఎవరెవరికి సమన్లు జారీ చేస్తోంది? ఏయే అంశాలపై కమిషన్‌ విచారణ జరుపుతోంది? వంటి వివరాలను తక్షణం తమకు అందించాలని రాష్ట్రపార్టీ నాయకత్వాన్ని ఆదేశించింది. మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసే అవకశాముందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా నివేదిక ఇవ్వాలని సూచించింది. దీంతో, నాలుగు పేజీల అత్యవసర నివేదికను పార్టీ రాష్ట్ర నేతలు సోమవారమే జాతీయనాయకత్వానికి పంపించారు. ఈ నివేదికలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను వివరించింది.


కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు పీసీ ఘోష్‌ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో సంబంధమున్న నీటిపారుదల శాఖతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులను విచారించింది. 2014-17 మధ్యలో కాళేశ్వరం పనులు జరిగినప్పుడు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు, అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా కమిషన్‌ సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం ఆ నివేదికలో పొందుపరచినట్లు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదల, ఆర్థిక మంత్రులను విచారించే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీ నివేదించినట్లు సమాచారం.


పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుపైనా ఆరా..

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు అంశంపైనా బీజేపీ జాతీయ నాయకత్వం వివరాలు తీసుకుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వినియోగించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌ కొనుగోలులో అప్పటి ఆర్థిక మంత్రిగా ఈటల సంతకం చేశారా? ఎవరెవరి ఫోన్లను అప్పట్లో ట్యాప్‌ చేశారు వంటి వివరాలను బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకుంది.

Updated Date - Jan 21 , 2025 | 04:22 AM