Konda Vishweshwar Reddy: బీజేపీలో నాతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:53 AM
పార్టీలో తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ ఇచ్చి నిరసన తెలిపిన ఎంపీ కొండా
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పార్టీలో తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్రపార్టీ కార్యాలయానికి వచ్చారు. తనతో పాటు తీసుకువచ్చిన ఫుట్‌బాల్‌తో ఆయన నేరుగా చంద్రశేఖర్ తివారీ చాంబర్‌కు వెళ్లారు.
తన నియోజకవర్గ పరిధిలో పార్టీపరంగా జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయనకు ఫుట్‌బాల్ ఇచ్చారు. దీంతో విస్మయానికి గురైన తివారీ, ఆ తర్వాత ఆయనతో చర్చించారు. తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో సమన్వయలోపం ఉందని, రంగారెడ్డి రూరల్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుల వైఖరి వివరించేందుకు చంద్రశేఖర్ తివారీని కలిశారని, నేతల తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, తనకు పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని కొండా, ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. తనపై కావాలనే కొంతమంది ప్రచారం చేశారని పేర్కొన్నారు.