Share News

Eatala Rajender: సహించలేకే చేయి చేసుకున్నా

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:51 AM

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఎవరి మీదా దాడికి పాల్పడలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ చెప్పారు. చట్ట ప్రకారం పనిచేయాల్సిన వ్యవస్థలు నిస్తేజంగా మారడంతో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Eatala Rajender: సహించలేకే చేయి చేసుకున్నా

  • వ్యవస్థలు నిస్తేజంగా మారడంతో తప్పలేదు

  • పేదల భూముల్లోకి కబ్జాదారులు వస్తే చూస్తూ ఊరుకోం

  • పోలీసులు, ఐఏఎ్‌సలు బానిసల్లా పని చేయవద్దు: ఈటల

హైదరాబాద్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఎవరి మీదా దాడికి పాల్పడలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ చెప్పారు. చట్ట ప్రకారం పనిచేయాల్సిన వ్యవస్థలు నిస్తేజంగా మారడంతో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రెండు, మూడు దశాబ్దాల క్రితం పేదలు కొనుక్కున్న భూములను రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, కబ్జాదారులు గద్దల్లా తన్నుకుపోతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు, ఐఏఎస్‌ అధికారులు బానిసల్లా పని చేయొద్దని, చట్టానికి కట్టుబడి పని చేయాలని హితవు పలికారు. పేదల ఆస్తుల్లోకి వచ్చి కబ్జాలకు పాల్పడినా, నిర్మాణాలు చేసినా బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.


పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల ఏకశిలానగరంలో 1985లో వేసిన లేఅవుట్‌లో 2076 మంది 200 గజాల చొప్పున స్థలం కొనుగోలు చేశారని చెప్పారు. ఈ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది కబ్జాదారులు గూండాలను పెట్టి నిజమైన భూ యజమానులపై దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. సర్వే నంబరు 739, 749లో 149 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారని, ఈ భూమిపై 2005 వరకు ఎలాంటి వివాదాలు లేవని ఈటల చెప్పారు. ఎంఏ రాజు, ఎ.వెంకటేష్‌, ఎ.విజయభాస్కర్‌ అనే ముగ్గురు వ్యక్తులు గతంలో భూమి అమ్మిన వ్యక్తి నుంచే సేల్‌ డీడ్‌ రాయించుకుని 47ఎకరాల భూమి తమదేనంటూ పేదల భూముల్లోకి వచ్చారని ఆరోపించారు. భూ అక్రమాలను నిలువరించేందుకు, పేద ప్రజల ఆస్తులను కాపాడేందుకు కమిటీ వేయాలని ఎంపీ ఈటల డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ పరిసరాల్లో జరిగిన భూ ఆక్రమణల వివరాలతో త్వరలో సీఎంను కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు.


ఎంపీ ఈటలపై కేసు నమోదు

పోచారం పరిధిలోని ఏకశిలానగర్‌ వెంచర్‌ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నవారిపై దాడి చేసినందుకు ఎంపీ ఈటలతోపాటు ఆయన అనుచరులపై పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ గార్డు ఉపేందర్‌ ఫిర్యాదు మేరకు ఈటల రాజేందర్‌, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, శివారెడ్డి, జుబేర్‌ అక్రమ్‌ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు వర్మ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

Updated Date - Jan 23 , 2025 | 04:51 AM