Karimnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో.. బీజేపీ ముందంజ
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:49 AM
మంగళవారం రాత్రి 12 గంటల వరకు ఆరు రౌండ్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి కన్నా 6,931 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే వరుసగా ఐదు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ.. 6వ, 7వ రౌండ్లలో మాత్రం వెనకబడింది.

ఆరు రౌండ్లలో 6,931 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గట్టి పోటీ
31,481 ఓట్లతో మూడో స్థానంలో
కొనసాగుతున్న బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ
కరీంనగర్ స్థానంలో కొనసాగుతున్న హోరాహోరీ
మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలేది కష్టమే!
తప్పనిసరి కానున్న రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు
కరీంనగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 12 గంటల వరకు ఆరు రౌండ్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి కన్నా 6,931 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే వరుసగా ఐదు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ.. 6వ, 7వ రౌండ్లలో మాత్రం వెనకబడింది. ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి 211 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఇక ఏడో రౌండ్‌లో నరేందర్‌రెడ్డికి 600 పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించినట్లు తెలుస్తోంది. ఇంకా నాలుగు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఈ నెల 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ఆ రోజంతా చెల్లని ఓట్లను విభజించి కట్టలు కట్టడానికే సరిపోయింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 2,52,100 ఓట్లు పోల్ కాగా.. వాటిలో 28,000 ఓట్లు చెల్లుబాటు కానివిగా నిర్ధారించారు.
మిగిలిన 2,24,100 ఓట్లను ఒక్కో రౌండ్‌లో 21,000 చొప్పున లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తయిన ఆరు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 45,401 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 38,470 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 31,481 ఓట్లు వచ్చాయి. కాగా, మరికొందరు ఇతరులు, స్వతంత్రులు స్వల్ప ఓట్లతోనే కొనసాగుతున్నారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ కొనసాగుతుండడంతో మొదటి ప్రాఽధాన్య ఓట్లలో ఎవరూ కోటా ఓట్లను సాధించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ధీమాతో ఉన్నా..
కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో విజయం తనదేనని కాంగ్రెస్ మొదటి నుంచి ధీమాతో ఉంది. కానీ, కాంగ్రెస్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి వరుసగా ఐదు రౌండ్లలో ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ నేతలు ఈ పరిస్థితిని ఊహించలేదు. బీసీ వాదం బలంగా వీచినా తానే మొదటి స్థానంలో నిలుస్తానని భావించిన కాంగ్రెస్ అభ్యర్థి.. ఐదు రౌండ్లలోనూ రెండో స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. రెండో ప్రాధాన్య ఓట్లు ఎక్కువగా లభించాయని ప్రచారం జరిగిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఆ ఓట్లు పెద్దగా లాభించే పరిస్థితి లేకుండా పోయింది. మెజారిటీ ఓట్లు మొదటి ముగ్గురు అభ్యర్థులకే లభిస్తున్న నేపథ్యంలో ఆయనకు రెండో ప్రాధాన్యఓట్లు గెలుపునకు అవసరమైన మేరకు రాకపోవచ్చని, ఆయనకు అనుకూలంగా వచ్చిన రెండో ప్రాఽధాన్యఓట్లు మొదటి ఇద్దరు అభ్యర్థుల వద్దే ఉండడంతో అవి నిరుపయోగమే అవుతాయని భావిస్తున్నారు. ఇక్కడ చెల్లని ఓట్ల వ్యవహారం పెద్ద ప్రహసనంలా మారింది. సాధారణంగా పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను గుర్తించి వాటిని తొలగించిన తర్వాత చెల్లిన ఓట్ల ఆధారంగా కోటా ఓటు నిర్ధారిస్తారు. అయితే ఈ నియోజకవర్గంలో చెల్లని ఓట్లను గుర్తించడానికి ఒక రోజంతా సమయం తీసుకున్నా కోటా ఓటును అధికారికంగా ప్రకటించలేకపోయారు. చెల్లని ఓట్ల విషయంలో అభ్యంతరాలు రావడంతో మంగళవారం వాటిని మళ్లీ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు కొన్ని ఓట్ల విషయంలో అభ్యంతరం తెలిపితే వాటిని తిరిగి పరిశీలిస్తున్నారని సమాచారం. దీనితో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కోటా ఓటు ఎంతో ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది.
బీసీ నేతలకు నిరాశ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశాభంగం
నేతల్లో ఐక్యత కొరవడినందునే!
వరంగల్/నల్లగొండ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): బీసీ వాదం బలంగా వినిపించారు. బీసీ సంఘాల నేతలూ అంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లు కనిపించారు. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సహా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీసీ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. కానీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. ప్రత్యేకించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీసీ వాదంతో బరిలో నిలిచిన అభ్యర్థులు 4వ, 6వ స్థానాలకు పరిమితం కావటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 20వేల వరకు బీసీ ఓటర్లున్నారని నేతలు ప్రకటించినా.. బీసీ అభ్యర్థులకు మాత్రం ఆ ఓట్లు రాలేదు. బీసీ నినాదం, వాదంతో బరిలో దిగిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు 3,992 ఓట్లు రాగా ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. కుడా మాజీ చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ 2,141 ఓట్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యారు. ఇందుకు కారణం.. కీలకమైన బీసీ నేతలు తలోదారిలో వెళ్లడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలు ఐక్యంగా ఒకే అభ్యర్థిని బరిలో దించి, నేతలంతా ఐక్యతగా ప్రచారం చేస్తే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి కొముయ్యకు బీసీ నేతలు మద్దతు ప్రకటించినా.. ఆ గెలుపు కమలం పార్టీ ఖాతాలోనే పడిందనే చర్చ ఉంది. ఇక కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బీసీ సంఘాలు మద్దతు ప్రకటించిన ప్రసన్న హరికృష్ణ కూడా మూడోస్థానంలో కొనసాగుతున్నారు. దీంతో బీసీ నేతలు ఇకపై పటిష్ఠమైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందిచుకోవాలనే అభిప్రాయాలు బీసీల నుంచి వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.