Bura Narsaiah: కేంద్ర పథకాలను ఇక్కడా అమలు చేయాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:06 AM
ఆయుష్మాన్ భారత్, విశ్వకర్మ యోజన పథకాలను తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

బీజేపీ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఆయుష్మాన్ భారత్, విశ్వకర్మ యోజన పథకాలను తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం 52 కోట్ల మంది చిరు వ్యాపారులకు రూ.32 లక్షల కోట్ల రుణాలు సెబీ బ్యాంకు ద్వారా అందించినట్లు తెలిపారు. ముద్రా లోన్ల ద్వారా 22-31 శాతం మైనార్టీ వర్గాలు లబ్ధిపొందాయని అన్నారు. విశ్వకర్మ యోజనతో దేశవ్యాప్తంగా 18 సంప్రదాయ వృత్తుల వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఎంపికైన వారికి 15 రోజుల పాటు శిక్షణ, రూ.15 వేల విలువైన టూల్ కిట్, రూ.లక్ష వరకు రుణ రాయితీని అందిస్తున్నట్లు తెలిపారు.
సుమారు రెండున్నర లక్షల దరఖాస్తులను పరిశీలన చేయకుండా తెలంగాణలో విశ్వకర్మ పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని నర్సయ్య గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో జరిగిన భూ కుంభకోణాల వెనుక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే ఉన్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా బీఆర్‌ఎస్ నేతలు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను తమ పేర్ల మీద మార్చుకున్నారని గతంలో రేవంత్ రెడ్డి అన్నారన్నారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఒక్క ఎకరం కూడా స్వాధీనం చేసుకోలేదని విమర్శించారు.