అక్కంపల్లి రిజర్వాయర్‌లో చచ్చిన కోళ్లు
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:38 AM
హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో.. ఓ కోళ్ల ఫాం నిర్వాహకుడు పెద్దసంఖ్యలో మృతి చెందిన కోళ్లను పడేశాడు.

బర్డ్‌ప్లూతో మృతి చెందిన కోళ్లుగా అనుమానం
కాల్వలో పడేసిన కోళ్ల ఫాం నిర్వాహకుడిపై
కేసు.. అరెస్టు.. విచారణకు ఆదేశించిన కలెక్టర్
మూడంచెల్లో శుద్ధితో నీటి సరఫరా
ప్రజలు ఆందోళన చెందవద్దు: జలమండలి
పెద్ద అడిశర్లపల్లి/దేవరకొండ/హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో.. ఓ కోళ్ల ఫాం నిర్వాహకుడు పెద్దసంఖ్యలో మృతి చెందిన కోళ్లను పడేశాడు. ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిను జాలర్లు.. రిజర్వాయర్ వెనుక జలాల్లో తేలియాడుతున్న కోళ్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి నీటిపారుదల డీఈ నాగయ్యతో కలిసి శుక్రవారం జాలర్ల సహాయంతో మృతి చెందిన కోళ్లను బయటకు తీయించారు. డ్రోన్ల సహాయంతో రిజర్వాయర్ మొత్తం గాలించారు. ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణకు ఆదేశించగా.. జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు ఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రిజర్వాయర్ చుట్టుపక్కల గల కోళ్లఫాంలను పరిశీలించారు. రమావత్ రాయమల్లు అనే కోళ్ల ఫాం నిర్వాహకుడు వీటిని అందులో పడవేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకోగా.. అతడు అంగీకరించాడు. మండలంలోని పడమటి తండాకు చెందిన రాయమల్లు పుట్టంగండి నుంచి అక్కంపల్లి రిజర్వాయర్‌కు వచ్చే కెనాల్ సమీపంలో కోళ్ల ఫాం నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం తెల్లవారుజామున వాటిలో 100 వరకు కోళ్లు మృతి చెందగా, 40 కోళ్లను గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాడు. మరో 60 కోళ్లను సమీపంలోని ఏఎమ్మార్పీ కాలువలో పడవేశాడు. అవి ప్రవాహంలో అక్కంపల్లి రిజర్వాయర్‌కు కొట్టుకువచ్చాయి. కాగా, రిజర్వాయర్ ఏఈ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు రాయమల్లుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు.
ఆందోళన చెందాల్సిన అవసరంలేదు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగుచూడటంతో ఈ కోళ్లు కూడా బర్‌ఫ్లూతోనే మృతి చెందినవిగా స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్డీవో రమణారెడ్డి, జలమండలి అధికారులు అన్నారు. కోదండాపూర్ వాటర్ ప్లాంట్‌లో శుద్ధి చేసిన తర్వాతే హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేస్తారని తెలిపారు. ఐఎస్ ప్రమాణాలతో మూడంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్ (క్యూఏటీ) అధికారులతోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), థర్డ్ పార్టీ లూసిడ్ సంస్థ.. కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రాలను సందర్శించి నీటి నమూనాలను సేకరించారు. ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలను గుర్తించలేదన్నారు. కాగా, వచ్చే వారం రోజులపాటు ప్రతి గంటకు ఇక్కడ నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. మూడెంచెల క్లోరినేషన్‌లో భాగంగా మొదటిదశలో నీటి శుద్ధి కేంద్రాల (డబ్ల్యూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియను చేపడతామన్నారు. అలాగే ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో తప్పనిసరిగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.