Share News

Bhumi Bharati Act: నేటి నుంచే రెవెన్యూ సదస్సులు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:46 AM

తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Bhumi Bharati Act: నేటి నుంచే రెవెన్యూ సదస్సులు

  • భూ భారతి అమల్లో భాగంగా 4 మండలాల్లో ప్రారంభం

  • భూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు

  • మే 1 నుంచి పరిష్కారం.. కలెక్టర్ల నేతృత్వంలో సదస్సులు

  • భూ సమస్యల్లేని తెలంగాణే లక్ష్యం: మంత్రి పొంగులేటి

  • పోర్టల్‌కు 36 గంటల్లో 5 లక్షల మందికిపైగా సందర్శకులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నామన్నారు. ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను గుర్తించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్‌లో గురువారం రెవెన్యూ సదస్సులను ప్రారంభించనున్నామన్నారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల నేతృత్వంలో అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4 మండలాల్లో మాత్రం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 18న ములుగు జిల్లా వెంకటాపురంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో తాను పాల్గొననున్నట్లు చెప్పారు. నారాయణ పేట జిల్లా మద్దూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలాల్లో భూ సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక దరఖాస్తును రూపొందించినట్లు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలను మినహాయించి.. మిగిలిన అన్ని సమస్యలపై వచ్చిన దరఖాస్తులను మే 1 నుంచి పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చే దరఖాస్తులను ఏ రోజుకా రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపుతామన్నారు. మండలానికి రెండు గ్రామాల్లో నిర్వహించే అవగాహనా సదస్సులకు కలెక్టర్లు రోజూ హాజరు కావాలని కోరారు. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సర్వేయర్‌ బృందాలుగా ఏర్పడి అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అవి పూర్తయ్యాక 4 మండలాల్లో నిర్వహించినట్లే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.


దరఖాస్తు నమూనా ఇలా..

భూ భారతి చట్టం అమలులో భాగంగా 4 మండలాల్లో భూ సమస్యలను గుర్తించేందుకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ఆధ్వర్యంలో దరఖాస్తును తయారు చేసింది. అందులో దరఖాస్తు నంబరు, భూ యజమాని వివరాలను తొలుత నమోదు చేయాలి. ఆ తర్వాత పాస్‌ పుస్తకం ఉందా, లేదా? అనే వివరాలను, ఖాతా నంబరు, ఇంటి చిరునామా, 10వ కాలం కింద భూ సమస్యలను తెలపాలి. ఇందులో భూమి ఖుష్కి, తరి అనే వివరాలను; పట్టా, ఇనాం, లావుణి, సీలింగ్‌, ప్రభుత్వ, భూదాన్‌, పోడు వంటి వివరాలను; భూమి ఎలా వచ్చిందనే విషయాన్ని తెలియజేయాలి. భూ సమస్యలకు సంబంధించి.. కొత్త పాస్‌ పుస్తకం రాలేదు, పాస్‌ పుస్తకంలో వివరాలు తప్పుగా ఉన్నాయి, సాగులో ఉన్న భూమి కంటే పాస్‌ పుస్తకంలో నమోదు చేసిన విస్తీర్ణం తక్కువ ఉండడం, సర్వే నంబర్లు తప్పు వేయడం, పట్టాదారు పేరు తప్పు రాయడం, నిషేధిత జాబితాలో ఉండడం, సాదాబైనామా క్రమబద్ధీకరణ కాలేదు.. ఇలా 11 రకాల సమస్యలను నమోదు చేసే అవకాశం కల్పించారు.


5 లక్షల మందికిపైగా సందర్శకులు

భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించిన 36 గంటల్లోనే 5 లక్షల మందికి పైగా సందర్శించారు. మొదటి నాలుగు గంటల్లో ఉద్యోగులు 20 వేల మంది లాగిన్‌ కాగా.. ప్రజలు 60 వేల మంది అయ్యారు. మంగళవారం ఒక్క రోజే భూ భారతి పోర్టల్‌ ద్వారా 1210 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక పోర్టల్‌లో ఉన్న 9 రకాల రిజిస్ట్రేషన్ల అమరిక గందరగోళంగా ఉందన్న ఫిర్యాదులు రావడంతో వాటిలో మార్పులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Updated Date - Apr 17 , 2025 | 04:46 AM