Bhatti Vikramarka: కోడ్ లేని జిల్లాల్లో ఇళ్ల పనులు ప్రారంభించండి
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:11 AM
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
శాటిలైట్ టౌన్‌షి్‌పలపై దృష్టి పెట్టాలి.. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయంలో శనివారం రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార-పౌర సంబంధాల శాఖలకు సంబంధించి బడ్జెట్ ముందస్తు సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూములను సాధించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇలాంటి భూవివాదాలపై ప్రభుత్వ న్యాయవాదులతో నిరంతరం చర్చించాలని అన్నారు. సినిమా కళాకారులను ప్రోత్సహించడంతోపాటు సమాజ వికాసానికి దోహదపడే లఘు చిత్రాలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకు, పథకాలకు లఘు చిత్రాల ద్వారా ప్రచారం కల్పించడానికి తగిన చర్యలు చేపట్టాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డుకు ఇరు వైపులా శాటిలైట్ టౌన్‌షి్‌పల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. డిజిటల్ భూసర్వేకు సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల జాబితా తయారు చేసి, ప్రతి నెలా అద్దెలు చెల్లించడానికి వీలుగా ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్య రహిత హరిత ఇంధనాన్ని(గ్రీన్ ఎనర్జీ) ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున... అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయ భవనాలపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భట్టికి మాల జేఏసీ సంఘాల వినతిపత్రం
కవాడిగూడ: ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నాయకులు బేర బాలకిషన్, జి.చెన్నయ్య, చెరుకు రాంచందర్, తాళ్లపల్లి రవి, గురువుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్ పేర్కొన్నారు. మాలలను కాంగ్రెస్ నుంచి దూరం చేసేందుకు, రాష్ట్రంలో బీజేపీ బలపడేలా మనువాదులు చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం బలికాకూడదని అన్నారు. ఈ మేరకు శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లు అశాస్త్రీయంగా ఉందని, ఇది పూర్తిగా కాంగ్రె్‌సకు నష్టమని అన్నారు. వర్గీకరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.