Bhatti Vikramarka: రూ.1.63 లక్షల కోట్లు ఇప్పించండి
ABN , Publish Date - Jan 21 , 2025 | 03:42 AM
తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.63 లక్షల కోట్ల మేర నిధులను మంజూరు చేయించడంలో సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి వినతి
ఓఆర్‌ఆర్ టు ఆర్‌ఆర్‌ఆర్ రోడ్లకు రూ.45 వేల కోట్లు
హైదరాబాద్ మెట్రో రెండోదశకు రూ.24,269 కోట్లు
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులివ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.63 లక్షల కోట్ల మేర నిధులను మంజూరు చేయించడంలో సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఓడిశాలోని కోణార్క్‌లో జరుగుతున్న ‘రాష్ట్రాల గనులు, ఖనిజాల శాఖల మంత్రుల’ మూడో జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన డిప్యూటీ సీఎం.. అక్కడే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయాలతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ చేపడుతున్న రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు 2016లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని కిషన్‌రెడ్డికి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లని.. దీని భూసేకరణ కోసం 50 శాతం మేర ఖర్చును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు వరకూ అభివృద్ధి చేయాలనుకుంటున్న 10 గ్రీన్ ఫీల్డ్ (కొత్త) రేడియల్ రోడ్లకు రూ.45,000 కోట్లు అవసరమని, వీటిని మంజూరు చేయించాలని కోరారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ కింద 76.4 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని, ఇందుకుగాను రూ.24,269 కోట్లు కావాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది తీరాభివృద్ధి ప్రాజెక్టు కింద.. మూసీ నది పునరుజ్జీవ చర్యలు, బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ ప్రాజెక్టుకు రూ.14,100 కోట్లు అవసరమని తెలిపారు. గోదావరి నుంచి 5 టీఎంసీల నీటిని మళ్లించి మూసీ నదిని శుద్ధి చేయాలని నిర్ణయించామని, దీనికి రూ.7,440 కోట్లు కావాలని వివరించారు. హైదరాబాద్ మహా నగరంలో 7,444 కిలోమీటర్ల పొడవునా సీవరేజ్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామని, ఈ ప్రాజెక్టు వ్యయం రూ.17,212.69 కోట్లు అని తెలిపారు. వరంగల్ నగరంలో భూగర్భ మురికినీటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రూ.4,170 కోట్లతో ప్రణాళికను రూపొందించామన్నారు. బందరు పోర్ట్ నుంచి హైదరాబాద్ డ్రై పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించాలని ప్రతిపాదించామని.. దానికి అవసరమైన రూ.17,000 కోట్లను ఇప్పించాలని కోరారు. రాష్ట్రంలోని గోదావరి లోయ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయించాలన్నారు. ఇలా అన్ని ప్రాజెక్టులకూ కలిపి మొత్తం రూ.1,63,559.31 కోట్లు అవసరమని.. ఈ నిధులను కేంద్రం నుంచి మంజూరు చేయించాలని కిషన్‌రెడ్డిని కోరారు. అలాగే.. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్నిరకాల అనుకూలతలూ హైదరాబాద్‌కు ఉన్నాయని.. కాబట్టి, హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.